రాష్ట్రంలోని అత్యంత రద్దీ జాతీయ రహదారుల్లో ప్రధానమైంది ఎన్‌హెచ్ 44. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అనుసంధానిస్తూ దేశంలోనే అతి పొడవైన జాతీయ రహదారిగా ఎన్‌హెచ్ 44 గుర్తింపు తెచ్చుకుంది. అయితే మెదక్ జిల్లా తూప్రాన్ శివారులో ఈ రోడ్డుపై టోల్గేట్ ఉంది. గత కొన్ని రోజులుగా అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు ఈ టోల్ గేట్ సమీపంలో వాహనదారుల నుంచి వసూళ్లు జరుగుతున్నాయి. దీనివల్ల ట్రాఫిక్ జామ్ సైతం జరుగుతోంది. ఈ సమాచారం అందుకున్న ఈటీవీ-ఈటీవీ భారత్ బృందం ఆదివారం అర్ధరాత్రి తూప్రాన్ టోల్గేట్ వద్ద నిఘా పెట్టింది. దీంతో నమ్మలేని నిజాలు వెలుగులోకి వచ్చాయి.
రాత్రి 11 గంటల సమయంలో టోల్‌గేట్‌కు 100 మీటర్లలోపు దూరంలో ఓ సుమో వచ్చి ఆగింది. ఆరుగురు వ్యక్తులు అందులోంచి కిందికు దిగారు. రోడ్డుమధ్యలో నిలబడి తమ చేతిలోని టార్చిలైట్‌తో డ్రైవర్ల కళ్లలోకి ఫోకస్ కొట్టి లారీలు, కంటైనర్లు, సరకు రవాణా వాహనాలను ఆపారు. తమ వద్ద ఉన్న రెండు అంగుళాల వెడల్పు, ఒక అడుగు పొడవు ఉన్న రేడియం స్టిక్కర్‌ను చూపించి.. దీనిని వాహనానికి అతికించాలని.. దీని వల్ల రోడ్డు ప్రమాదాలు జరగవని డ్రైవర్లకు చెబుతున్నారు. ఈ స్టిక్కర్ వాహనానికి లేకపోతే.. పోలీసులు జరిమానా విధిస్తారని వారిని బెదిరింపులకు గురి చేస్తున్నారు. కొన్ని అడుగుల దూరంలోనే పోలీస్ పెట్రోలింగ్ వాహనం ఉండటంతో వాహనదారులు ఇది నిజమని నమ్మి స్టిక్కర్లు వేయించుకున్నారు. దీనికి గానూ ఒక్కో వాహనానికి రూ.500 వరకు వసూలు చేస్తున్నారు.
ఇక్కడ జరుగుతున్న తతంగాన్ని వీడియో తీయడాన్ని గమనించిన ఆ బృందంలోని ఓ వ్యక్తి వెళ్లి పెట్రోలింగ్ వాహనంలోని పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో ఓ కానిస్టేబుల్ వచ్చి.. ఎవరు మీరు.. ఇక్కడ ఏం చేస్తున్నారు.. ఇక్కడి నుంచి వెళ్లిపోండి అంటూ హుకూం జారీ చేశాడు. తాము ఈటీవీ-ఈటీవీ భారత్ విలేకరులమని చెప్పడంతో వారు కంగుతిన్నారు. ఇక్కడ ఏం జరుగుతుందని ఈటీవీ బృందం వారిని ప్రశ్నించగా.. పొంతనలేని సమాధానం చెప్పారు. మీరు ఏ డిపార్ట్మెంట్.. ఎందుకు వాహనదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని ప్రశ్నిస్తే.. తమకు పోలీసుల అనుమతి ఉందని.. మెదక్, తూప్రాన్ డీఎస్పీలు అనుమతి ఇచ్చారంటూ చెప్పుకొచ్చారు. మరి అర్ధరాత్రులు ఎందుకు వసూలు చేస్తున్నారని అడగడంతో ఉదయం వస్తామంటూ అక్కడి నుంచి జారుకున్నారు.
అర్ధరాత్రి నడిరోడ్డుపై జరుగుతున్న ఈ అక్రమానికి పోలీసులు అండగా ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. మెదక్ జిల్లా కాళ్లకల్ నుంచి మాసాయిపేట వరకు ఉన్న 25 కిలో మీటర్ల రహదారిపై పెట్రోలింగ్ విధులు నిర్వర్తించాల్సిన పోలీసు వాహనం.. ప్రతిరోజూ అక్రమార్కులకు సహాయంగా ఉంటోంది. సాధారణంగా నిబంధనల ప్రకారం పోలీస్ పెట్రోలింగ్ వాహనం ఒక ప్రదేశంలో 15 నిమిషాల కంటే ఎక్కువ సమయం ఉండకూడదు. తమ నిర్దేషిత ప్రాంతంలో తిరుగుతూ విధులు నిర్వర్తించాలి. పెట్రోలింగ్ వాహన సిబ్బందిని మీరు ఎందుకు ఇక్కడ ఉన్నారని ఈటీవీ బృందం ప్రశ్నించగా.. ఓ పోలీస్ ఉన్నతాధికారి ఆదేశాలతో రేడియం స్టికర్లు వేసే వారికి భద్రతగా ఉన్నట్లు వారు బదులిచ్చారు. గత వారం నుంచి ప్రతిరోజూ రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజాము 4 గంటల వరకు ఈ విధులే నిర్వర్తిస్తున్నట్లు వారు తెలిపారు.