హరితహారంలో భాగంగా అటవీ పునరుజ్జీవనానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోంది. ఇందులో భాగంగానే ముఖ్యమంత్రి కేసీఆర్ అటవీ ప్రాంతంలో మొక్క నాటి ఆరోవిడత హరితహారానికి శ్రీకారం చుట్టనున్నారు. ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి ఉదయం 11:30 నిమిషాలకు కేసీఆర్ నర్సాపూర్ చేరుకుంటారు. అటవీ శాఖ అభివృద్ధి చేసిన అర్బన్ పార్కును ప్రారంభించి.. నేరేడు మొక్క నాటనున్నారు. అనంతరం పార్కులో ఎత్తైన గుట్టపై ఏర్పాటుచేసిన 60 అడుగుల వాచ్‌టవర్ అటవీ అందాలు వీక్షిస్తారు.
ఎవరూ రావొద్దు..
కరోనా నేపథ్యంలో జనసమీకరణ, బహిరంగ సభ లేకుండా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు పరిమితంగానే హాజరవుతున్నారు. సీఎంతో పాటు కేవలం 8 మంది ప్రముఖులు మాత్రమే మొక్కలు నాటనున్నారు. నాయకులు, కార్యకర్తలు కార్యక్రమానికి రావొద్దని ఇప్పటికే సమాచారం ఇచ్చారు. ప్రజలు, పార్టీ శ్రేణులు ఇళ్ల వద్ద మొక్కలు నాటి కేసీఆర్‌కు సంఘీభావం తెలపాలని మంత్రి హరీష్ రావు సూచించారు.