Rains in TS: రాష్ట్రవ్యాప్తంగా వర్షం తెరపినిచ్చినా ఆ ప్రభావం కొనసాగుతోంది. మెదక్ జిల్లావ్యాప్తంగా శుక్రవారం రాత్రి నుంచి విస్తారంగా వర్షాలు పడ్డాయి. ఈ ప్రభావంతో పలు చోట్ల వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. మాసాయిపేట మండలంలో హల్దీ వాగు ఉద్ధృతితో వెల్దుర్తి మండలం ఉప్పులింగాపూర్ వద్ద వంతెనపై రాకపోకలకు నిలిపివేశారు. మనోహరాబాద్ మండలం రామాయిపల్లి వద్ద ఉన్న రైల్వే అండర్ పాస్‌లో పూర్తిగా వర్షం నీరు నిలిచి హైదరాబాద్ నాగపూర్ ఎన్హెచ్-44 జాతీయ రహదారిపై రాకపోకలు తీవ్ర అంతరాయం కలిగింది..
శివ్వంపేట మండలంలో కుండపోత వర్షానికి రామాలయం పురాతన బురుజుగోడ కూలింది. సింగూర్ గేట్లు ఎత్తడంతో వనదుర్గ ప్రాజెక్టు పొంగి... ఏడుపాయల క్షేత్రంలోకి నీరు చేరింది. హవేలి ఘనపూర్- గంగాపూర్ మధ్య వంతెన కూలిపోయి రాకపోకలు నిలిచిపోయాయి. నార్సింగ్ వద్ద జాతీయ రహదారిపై వరద ప్రవాహంతో అదుపుతప్పిన ఓ బైక్ డివైడర్ ను ఢీకొట్టడంతో వాహనదారుడు అక్కడికక్కడే మృతిచెందాడు. మంజీరా నదిలో చిక్కుకున్న వ్యక్తిని ఈతగాళ్లు బయటకు తెచ్చారు. కప్రయిపల్లీ వద్ద ప్రధాన రోడ్డు తెగిపోయి 6 ఆవులు కొట్టుకుపోయాయి. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం అల్వాల్లో కూడవల్లి వాగు ఉద్ధృతికి యువకుడు గల్లంతయ్యాడు. సిద్దిపేటలో మోయ తుమ్మెద వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.
ఉమ్మడి నిజామాబాద్లో మహారాష్ట్ర సరిహద్దుల్లోని లెండి వాగు పొంగి పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జుక్కల్ మండలం 'బాబాల్ గావ్, సవాల్ గావ్' ప్రాంతాలకు రవాణా స్తంభించింది. పిట్లం మండలం తిమ్మానగర్ వద్ద నల్లవాగు వంతెన తెగి నారాయణ ఖేడ్, సిర్గాపూర్ మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కామారెడ్డి జిల్లా కౌలాస్ నాలాప్రాజెక్టులోకి వరద ఉద్ధృతి వచ్చి చేరుతోంది. నిజాంసాగర్ ప్రవాహం రావడంతో గేట్లను ఎత్తి మంజీరానదికి నీటిని వదిలారు.
మహబూబాబాద్ జిల్లాలో భారీ వర్షాలకు జనజీవనం స్తంభించింది. దంతాలపల్లి-పెద్దముప్పారం గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అర్పనపల్లి వంతెనపై వట్టివాగు ఉద్ధృతితో కేసముద్రం-గూడూరు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. దంతాలపల్లిలో పాలేరువాగు, నరసింహులపేటలో ఆకేరు వాగు ఉప్పొంగుతున్నాయి. ములుగు జిల్లా ముత్తారం వాగు పొంగి గ్రామస్థులు ప్రవాహంలో చిక్కుకున్నారు. ట్రాక్టర్ డ్రైవర్ అప్రమత్తతతో బయటపడ్డారు. వాగుల ఉద్ధృతితో జనగామ-హుస్నాబాద్.... జనగామ-పాలకుర్తి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. తొర్రూరు మండలం కంటాయపాలెం చెరువులో గేదేను కాపాడబోయి ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. గల్లంతైన వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించి సహాయక చర్యలపై ఆరా తీశారు. అనంతరం వరంగల్ నగరంలోని మండి బజార్‌లో రాత్రి వర్షం కారణంగా ఇంటి గోడ కూలి ఇద్దరు మృతి చెందడంపై ఆరా తీశారు.