మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మెదక్ జిల్లాలోని ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు, చెక్ డ్యాంలు పూర్తిగా నిండి పొంగిపొర్లుతున్నాయి. సంగారెడ్డి జిల్లాలోని సింగూర్ ప్రాజెక్టు పూర్తిగా నిండగా... గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ఆ నీటితో మంజీరా నది జలకళ సంతరించుకుంది.
ఉప్పొంగుతున్న వాగులు... ఉసూరుమంటున్న రైతులు
రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులు, ప్రాజెక్టులు ఉప్పొంగుతున్నాయి. మెదక్ జిల్లాలోని చెరువులు, కుంటలు, ప్రాజెక్టులు పూర్తిగా నిండి అలుగులు పారుతున్నాయి. వరదల ప్రవాహానికి చాలా చోట్ల పంట నష్టం వాటిల్లింది.
మంజీర నదిపై కొల్చారం మండలం చిన్న ఘన్పూర్ వద్ద నిర్మించిన వనదుర్గ ప్రాజెక్టు పొంగిపొర్లుతోంది. ఈ క్రమంలో ఏడుపాయల వన దుర్గామాత ఆలయం జలదిగ్బంధంలో చిక్కుకుంది. ఆలయానికి వెళ్ళే దారి జలమయం కావటం వల్ల రాజగోపురంలో ఉత్సవ విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు నిర్వహిస్తున్నారు.
మరోవైపు చాలా ప్రాంతాల్లో కోతకు వచ్చిన వరి పంటలు నీటమునిగాయి. జిల్లా వ్యాప్తంగా వందలాది ఎకరాల్లో వరి పైరు నేలకొరిగింది. పలుచోట్ల కోసి పెట్టిన వరి తడిసిపోయింది. పంట చేతికందే సమయంలో దెబ్బతినడం వల్ల రైతులు లబోదిబోమంటున్నారు.