కోనాయిపల్లి, కూచారం గ్రామాలను హరితమయం చేయాలని ఆయా పల్లెలవాసులు సమష్టిగా నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగానే ఎందుకు పనికి రాకుండా ఉన్న పెద్ద గుట్టలను తొలగించి చదును చేశారు. ఆయా చోట్ల రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారంలో భాగంగా మొక్కలు పెంపకం చేపట్టారు. ఏవేవో నాటకుండా అందరూ కలిసి ఏ ఏ రకాలను నాటాలో నిర్ణయించారు. ఇలా తమ సొంత ఆలోచనలతో ఔషధ, పండ్లు, పూల రకాలకు చెందిన వాటిని ఎంచుకొని నాటి, వాటి సంరక్షణ చర్యలను పక్కాగా చేపట్టారు. ఇక్కడికి వచ్చిన వారంతా వనాలను చూసి ముగ్ధులవుతున్నారు. ప్రజాప్రతినిధులను, గ్రామస్థులను అభినందిస్తున్నారు.
ప్రత్యేకమైనవి..
తూప్రాన్ మండలం కోనాయిపల్లి (పీబీ), మనోహరాబాద్ మండలం కూచారం గ్రామాల్లో హరితహారాన్ని సద్వినియోగం చేసుకుంటూ వినూత్న మొక్కలు నాటే శ్రీకారం చుట్టారు.
- కూచారం గ్రామంలో మూడెకరాల్లో రెండేళ్ల కిందట హరిత వనం పేరిట ఔషధ, పండ్లు, మొక్కలు నాటారు. ప్రధానంగా చెర్రి, లవంగం, బిర్యానీ ఆకు, ఆపిల్, శ్రీగంధం, ఎర్రచందనం, చీమచింత, అంజీరా, మెహందీ ఇలా ప్రత్యేకమైన వాటిని ఎంపిక చేసుకున్న మొక్కలు నాటారు. అధికారులు, ప్రజాప్రతినిధుల చొరవతో చక్కని పార్కు ఏర్పాటుకు రుపకల్పన చేశారు. ప్రజలు సేద తీరేందుకు వీలుగా పచ్చదనం పెంపొందించారు. స్థానికుల కోసం నడక దారులను అందుబాటులోకి తీసుకొచ్చారు.
- కోనాయిపల్లి (పీబీ) గ్రామంలో సర్పంచి పాండు.. స్థానిక యువకుల చొరవతో పనికిరాకుండా ఉన్న రాళ్లు గుట్టలను చదును చేసి ఔషధ పార్కుగా మర్చారు. ప్రజల ఆరోగ్యానికి మేలు చేసే వివిధ రకాల మొక్కలను నాటారు. ప్రస్తుతం అవి ఎదిగే దశలో ఉన్నాయి.