School Play Grounds: సర్కారు పాఠశాలల్లో మైదానాలు కుచించుకుపోతున్నాయి. గ్రామాల్లో ప్రభుత్వపరమైన ఏ నిర్మాణం చేపట్టాలన్నా బడుల స్థలాలనే ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఇప్పటివరకు ఈ జాగాల్లో నీళ్ల ట్యాంకులు మాత్రమే ఉండేవి. రెండు మూడేళ్లుగా గ్రామ పంచాయతీ కార్యాలయాలు, గోదాములు, పల్లె ప్రకృతి వనాలు, నర్సరీలు, ఆరోగ్య ఉప కేంద్రాలు, రైతు వేదికలు, ట్రాన్స్‌ఫార్మర్లు.. ఇలా అనేకం వెలుస్తున్నాయి. మెదక్ జిల్లాలో ఏకంగా 25 శాతం పల్లె ప్రకృతి వనాలను బడుల్లోనే ఏర్పాటు చేసినట్లు అంచనా. ఇప్పటివరకు ప్రైవేటు పాఠశాలల్లోనే ఆట స్థలాల కొరత ఎక్కువగా ఉండేది. ఆ దుస్థితి ఇప్పుడు సర్కారు బడులకూ వచ్చింది. ఈ నిర్మాణాలన్నీ ప్రజోపయోగకరమైనవే అయినా ఇతర ప్రదేశాల్లో నిర్మిస్తే విద్యార్థులకు ఇబ్బంది ఉండేది కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
పిల్లల భద్రతకూ ముప్పే..
Government utilizing public school Places : నీళ్ల ట్యాంకులను పాఠశాలల ఆవరణల్లో నిర్మించడం రెండు దశాబ్దాలుగా జరుగుతూనే ఉంది. మూలకు నిర్మిస్తున్నా అవి నిండి నీళ్లు ఆవరణలోకి వస్తున్నాయి. దానివల్ల పిల్లలు తిరిగే మైదానం బురదమయమవుతోంది. కొన్ని చోట్ల ట్యాంకులు శిథిలావస్థకు చేరి ఎప్పుడు కూలిపోతాయో అన్నట్లు పరిస్థితి ఉంది. అటు వైపు విద్యార్థులు వెళ్లకుండా నిత్యం అప్రమత్తంగా ఉండాల్సి వస్తోందని ప్రధానోపాధ్యాయులు చెబుతున్నారు. కొన్ని చోట్ల ఇప్పటికే ఒక ట్యాంకు ఉండగా మరో దాన్ని కొత్తగా నిర్మిస్తుండటం గమనార్హం. పల్లె ప్రకృతి వనాల ఏర్పాటుతో కోతులు, పురుగులు, పాముల బెడద ఎక్కువైందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. పాఠశాల సహా ఇతర కార్యాలయాలకు అన్నింటికి ఒకటే ద్వారం కావడంతో గేటుకు తాళం వేసే అవకాశం లేకుండా పోయింది. దానివల్ల పిల్లల భద్రతకు కూడా ముప్పు ఏర్పడుతోందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
విద్యాశాఖ.. మౌనం ఎందుకో?
పాఠశాల ఆవరణల్లో ఏం చేయాలన్నా పాఠశాల విద్యాశాఖ అనుమతి అవసరం లేదన్నట్లు పరిస్థితి మారిపోయింది. సాంకేతికంగా మండల, జిల్లా పరిషత్తు పాఠశాలల భవనాలు, వాటి నిర్వహణ, స్థలం అన్నీ పంచాయతీరాజ్ శాఖ పరిధిలోనే ఉంటాయి. కానీ కనీస విద్యాశాఖకు సమాచారం ఇవ్వకుండా నిర్మాణాలు చేపడుతున్నారు. అయినా విద్యాశాఖ పట్టింపు లేనట్లు వ్యవహరిస్తోంది. ఆడుకోవడానికి స్థలం లేకుండా నిర్మాణాలు చేపడుతున్నా.. రాకపోకలతో చదువుకు ఆటంకం కలుగుతున్నా ఆ శాఖ ఎందుకు మౌనంగా ఉంటోందన్నది ప్రశ్న.
అన్నింటి మధ్య.. ఆటలు మిథ్య
ఇది కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం లింగంపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల ఆవరణ. ఇక్కడ వినియోగంలో మూడు గదులు ఉండగా మరో రెండు గదులు శిథిలావస్థకు చేరాయి. ఈ ప్రాంగణంలో ఇప్పటికే పెద్ద నీళ్ల ట్యాంకు ఉంది. ఏడాది క్రితం పల్లె ప్రకృతి వనం, నర్సరీలను ఏర్పాటు చేశారు. వాటికి దాదాపు ప్రాంగణంలోని సగం స్థలం పోయింది. ఒక మూలన అంగన్‌వాడీ కేంద్రం నడుస్తోంది. ఇంకా పంచాయతీ కార్యాలయం భవనాన్ని నిర్మిస్తున్నారు. ఫలితంగా పిల్లలు ఆడుకోవడానికి స్థలం లేకుండా పోయింది.