తెలంగాణ

telangana

ETV Bharat / state

మెదక్​లో రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోళ్లు - మెదక్​లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు

యాసంగి సీజన్‌కు సంబంధించి మెదక్​ జిల్లాలో రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోళ్లు ప్రక్రియ జరిగింది. యాసంగిలో అత్యధికంగా కొనుగోళ్లు చేయడం ఇదే ప్రథమం. గతేడాదితో పోలిస్తే ఈ సారి రెండున్నర రెట్లు అధికంగా కొనుగోలు చేయడం విశేషం.

food Grain Purchases is all time record in Medak district
మెదక్​లో రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోళ్లు

By

Published : May 31, 2020, 1:40 PM IST

మెదక్​ జిల్లా వ్యాప్తంగా యాసంగిలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో 174, ఐకేపీ ఆధ్వర్యంలో 31 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. కొవిడ్‌-19 నేపథ్యంలో జిల్లాలో ఈసారి కేంద్రాల సంఖ్యను పెంచారు. ధాన్యం ఉత్పత్తులు అధికంగా ఉన్న చోట కేంద్రాలను ఏర్పాటు చేయగా, మార్చిలో కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. జిల్లా అధికారులు 1.79 లక్షల మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈక్రమంలో శనివారం నాటికి 47,858 మంది రైతుల నుంచి 1.80 లక్షల మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేశారు. అంటే లక్ష్యాన్ని అధిగమించారు. ఇప్పటి వరకు రైతులకు రూ.313 కోట్లను చెల్లించారు. ఇంకా రూ.6 కోట్ల మేర ధాన్యం డబ్బులు చెల్లించాల్సి ఉంది.

గతేడాది యాసంగి సీజన్‌లో 28,464 మంది రైతుల వద్ద నుంచి 67,025 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి.. రూ.118 కోట్లు చెల్లించారు. మంత్రి హరీశ్‌రావు, పాలనాధికారి ధర్మారెడ్డి, అదనపు పాలనాధికారి నగేశ్‌ తరచూ సమీక్షలు, టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించి కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసేలా పర్యవేక్షించారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. ఆయా కేంద్రాల్లో నిలిచిపోయిన ధాన్యాన్ని ఆర్టీసీ కార్గో బస్సులు, ట్రాక్టర్లు, లారీల ద్వారా రైసుమిల్లులకు తరలించేలా దృష్టి సారించారు. ఈ సీజన్‌లో నాలుగుసార్లు వర్షం పడగా... కొనుగోళ్లకు అంతరాయం లేకుండా రైతుల నుంచి ధాన్యంను సేకరించి మిల్లులకు తరలించారు. కొవిడ్‌-19 ద్వారా అవరోధాలు ఎదురైనా ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం కృషి, రైతుల సహకారంతో ధాన్యం కొనుగోళ్లు చేశామని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి శ్రీనివాస్‌ తెలిపారు. ప్రస్తుతం రైతులు కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకురావడం లేదన్నారు.

ABOUT THE AUTHOR

...view details