తెలంగాణ

telangana

ETV Bharat / state

'మద్దతు ధర కల్పించండి... లేదంటే ప్రగతి భవన్ ముట్టడిస్తాం'

సన్నరకం పంట వేయాలని సూచించిన ప్రభుత్వం మద్దతు ధరపై ఎందుకు మాట్లాడటం లేదని రైతులు ప్రశ్నిస్తున్నారు. సన్న ధాన్యానికి రూ.2500 మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ మెదక్- హైదరాబాద్ ప్రధాన రహదారిపై రాంపూర్ రైతులు ఆందోళన చేపట్టారు. లేదంటే ప్రగతి భవన్ ముట్టడిస్తామని హెచ్చరించారు.

'మద్దతు ధర కల్పించండి... లేదంటే ప్రగతి భవన్ ముట్టడిస్తాం'

By

Published : Nov 18, 2020, 4:22 PM IST

Updated : Nov 18, 2020, 4:40 PM IST

సన్నరకం పంటలను వేయమని చెప్పిన సీఎం కేసీఆర్ ఇప్పుడు మద్దతు ధర గురించి మాట్లాడకపోవడం ఎంతవరకు సమంజసం అంటూ రైతులు ప్రశ్నిస్తున్నారు. మెదక్ - హైదరాబాద్ ప్రధాన రహదారిపై మెదక్ జిల్లా రాంపూర్ రైతులు ధర్నా చేపట్టారు. కొల్చారం మండల భాజపా అధ్యక్షుడు పాతూరి దయాకర్ గౌడ్, భాజపా కార్యకర్తలు ఈ ఆందోళనలో పాల్గొన్నారు.

రైతుల కన్నీళ్లు రాష్ట్రానికి మంచిది కాదని... సన్న ధాన్యానికి క్వింటాకి రూ.2500 మద్దతు ధర తక్షణమే కల్పించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రగతి భవన్ ముట్టడిస్తామని హెచ్చరించారు. కనీసం రూ.2100 ధర కల్పించాలని కోరుతున్నారు. దోమపోటు, అధిక వర్షాలతో నష్టపోయామని.. పరిహారం చెల్లించి ఆదుకోండి అని అన్నదాతలు విజ్ఞప్తి చేస్తున్నారు.

కొల్చారం ఎస్సై శ్రీనివాస్ సంఘటనా స్థలానికి చేరుకొని... రైతులకు నచ్చజెప్పి ధర్నాను విరమింపజేశారు. ఈ ఆందోళనతో గంట పాటు ట్రాఫిక్ స్తంభించింది.

ఇదీ చదవండి:మిర్యాలగూడలో టోకెన్ల కోసం పడిగాపులు... రైతుల ఆందోళన

Last Updated : Nov 18, 2020, 4:40 PM IST

ABOUT THE AUTHOR

...view details