మెదక్ జిల్లా శివ్వంపేట మండలంలోని చిన్న గొట్టుముక్కుల ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద రైతులు ఆందోళన(Farmers Protest)కు దిగారు. ఒక దశలో సహనం కోల్పోయిన రైతులు వరి ధాన్యానికి నిప్పంటించి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తూప్రాన్ నర్సాపూర్ రహదారిపై బైఠాయించిన పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. రహదారిపై ఇరువైపుల కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.
Farmers Protest: ధాన్యం కొనుగోలు చేయాలని రైతుల ధర్నా - శివ్వంపేట వార్తలు
ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద తీసుకొస్తే నెలల తరబడి పడిగాపులు కాసినా కొనుగోలు చేయడం లేదని రైతులు ధర్నా(Farmers Protest) చేశారు. మెదక్ జిల్లా శివ్వంపేట మండలంలోని చిన్న గొట్టుముక్కుల ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద నిరసన వ్యక్తం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని లేకుంటే ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. నెలరోజులుగా కంటి మీద కునుకు లేకుండా పడిగాపులు పడుతున్నట్లు చెప్పారు. ఇప్పటికే పలుమార్లు వర్షం కురిసి మొలకలు వచ్చాయని.. అయినా అధికారులు ప్రజాప్రతినిధులు ఆలస్యం చేస్తున్నారని అన్నారు.
విషయం తెలుసుకున్న శివ్వంపేట ఎంపీపీ హరికృష్ణ రైతులను సముదాయించే ప్రయత్నం చేయగా ఆగ్రహించిన రైతులు ఆయనతో వాగ్వాదానికి దిగారు. మండల వ్యాప్తంగా అన్ని కొనుగోలు కేంద్రాల్లో ఇలాంటి పరిస్థితి ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని ఎంపీపీ హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు.