విద్యుత్‌శాఖ అధికారుల పర్యవేక్షణ లేమితో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. విద్యుత్ నియంత్రికలు మరమ్మతుకు గురయ్యాయని రైతులు ఎంత చెప్పినా అధికారులు పట్టించుకోవడం లేదు. మరమ్మతు చేయడానికి కొన్నిచోట్ల డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. నియంత్రిక మరమ్మతులకు గురైందని విద్యుత్‌శాఖ సిబ్బందికి ఫిర్యాదు చేస్తే వారు ఏ మాత్రం ఖాతరు చేయడం లేదు.
మరమ్మతుతో ప్రాణసంకటం
పంట ఎండిపోతుందనే భయంతో రైతులే నియంత్రికలను తీయడం.... సరిచేశాక బిగించడం.. చిన్నపాటు మరమ్మతులు ఉంటే వారే చేసుకొంటున్నారు. జిల్లాలోని మెదక్, తూప్రాన్, పాపన్నపేట, నర్సాపూర్, రామాయంపేట మండల్లాలో విద్యుత్తు నియంత్రికల మరమ్మతు కేంద్రాలకు చాలామంది రైతులు స్వయంగా తీసుకొచ్చి తీసుకెళ్తున్నారు. జట్టుగా నియంత్రికల పని చేసుకుంటున్నారు. ఈక్రమంలో ఎవరైనా ఎప్పుడైనా విద్యుత్తు సరఫరా పునరుద్ధరణ చేస్తే ప్రాణాలు పోతున్నాయి.
స్పందిస్తే మేలు...
జిల్లాలో ప్రాణాల మీదకు తెచ్చే పనులు జరుగుతున్నా పట్టింపు లేదు. విద్యుత్తు అధికారి అనుమతితో పనులు చేసుకోవచ్చనే భావనతో రైతులు ఉంటున్నారు. వారిపై ఫిర్యాదులు చేస్తే అసలుకే మోసం జరిగి పంట నష్టం పెరుగుతుందని భయపడుతుంటారు. విద్యుత్తు సరఫరా అత్యవసరంగా భావించి అధికారులు, సిబ్బంది స్పందించి పరిష్కరిస్తే మేలు జరుగుతుందని కర్షకులు అంటున్నారు.