సన్న రకం వరికి గిట్టుబాటు ధర కల్పించాలని, మంజీరా నది వరద ముంపులో నష్టపోయిన బాధితులకు ప్రభుత్వం పరిహారం అందించి ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ రైతులు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా మెదక్, పాపన్నపేట, కొల్చారం మండలాలకు చెందిన పలువురు రైతులు ఎల్లాపూర్ బ్రిడ్జి మీద రాస్తారోకో నిర్వహించారు. అనంతరం అక్కడి నుంచి పాదయాత్రగా తరలివచ్చి మెదక్ కలెక్టరేట్ ప్రధాన గేటు ముందు ధర్నా చేపట్టారు.
సన్న రకం వరికి మద్దతు ధర కల్పించాలంటూ రైతుల ధర్నా - మెదక్ కలెక్టరేట్ ఎదుట రైతుల ధర్నా వార్తలు
సన్న రకం వరి ధాన్యానికి మద్దతు ధర కల్పించాలంటూ రైతులు ఆందోళనకు దిగారు. ఇటీవల కురిసిన వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు మెదక్ కలెక్టరేట్ ప్రధాన గేటు ముందు ధర్నా నిర్వహించారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకు సన్న రకం వరి సాగు చేశామని.. పంట చేతికొచ్చినా మద్దతు ధరపై సీఎం కేసీఆర్ మాట్లాడకపోవడం దారుణమని ఎల్లాపూర్ గ్రామ సర్పంచ్ ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. ఇటీవల కురిసిన వర్షాలతో చేతికొచ్చిన పంట పూర్తిగా నీట మునిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా మంజీరా నది పరీవాహక ప్రాంతాల్లో చాలా మంది రైతులు నష్టపోయారని.. వారికి ప్రభుత్వం రూ.25 వేల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. సన్న రకం వరి సాగు చేయడం ద్వారా పంటకు వివిధ తెగుళ్లు సోకి పెట్టుబడి పెరిగి, దిగుబడి తగ్గిందని ఆరోపించారు. ఈ సందర్భంగా సన్నరకం వరికి క్వింటాల్‌కు రూ.2,500 మద్దతు ధర కల్పించాలని కోరారు. కార్యక్రమంలో మూడు మండలాల రైతులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి.. నిమ్మ పంటకు ధరల తెగులు సోకింది... రైతుకు ఆర్థిక కష్టాల్ని మిగుల్చుతోంది