తెలంగాణ

telangana

ETV Bharat / state

గుప్పెడంత బియ్యం.. బోలెడంత సాయం.!

లాక్​డౌన్​ నేపథ్యంలో జీవనోపాధి కోల్పోయామని, తినడానికి బియ్యం లేవంటూ పలువురు తహసీల్దార్‌ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. దాతలు ఇచ్చిన బియ్యం కొందరికే అందడం వల్ల మిగిలిన వారు అర్ధాకలితో అలమటిస్తున్నారు. ఈ క్రమంలో మెదక్​ జిల్లా పాలనాధికారికి వచ్చిన ఆలోచనను అధికారులు కార్యరూపంలోకి తీసుకువచ్చారు.

medak collector latest news
medak collector latest news

By

Published : May 13, 2020, 10:07 AM IST

రెక్కలు ముక్కలు చేసుకుంటే పూట గడవని కుటుంబాలు మెదక్​ జిల్లాలో చాలా ఉన్నాయి. లాక్‌డౌన్‌ కొనసాగుతుండడం...ఎలాంటి పనులు లేకపోవడం వల్ల వారు తినడానికి కనీసం బియ్యం కూడా ఉండడం లేదు. ఈ విషయాన్ని గ్రహించిన పాలనాధికారి ధర్మారెడ్డి రేషన్‌కార్డుదారులు కొంత బియ్యాన్ని అందజేయాలని పిలుపునిచ్చారు. పౌర సరఫరాల శాఖ అధికారుల ద్వారా జిల్లాలోని రేషన్‌ దుకాణాల వద్ద పెద్ద డబ్బాలను ఏర్పాటు చేయించారు. బియ్యం వితరణకు గల కారణాలను కార్డుదారులకు తెలియజేస్తున్నారు. దీంతో పలువురు దుకాణాల్లో ఏర్పాటు చేసిన డబ్బాలో బియ్యాన్ని వేస్తున్నారు. మొదట్లో కొంతమంది అనాసక్తి చూపించినా తర్వాత ఒకరిని చూసి మరొకరు స్పందిస్తున్నారు.

జిల్లాలో 2.13 లక్షల రేషన్‌ కార్డుదారులు ఉన్నారు. కార్డుదారుల కుటుంబసభ్యుల సంఖ్య ఆధారంగా ఆరు కిలోల చొప్పున బియ్యం అందజేస్తున్నారు. లాక్‌డౌన్‌ను ప్రకటించాక ప్రభుత్వం పంపిణీ చేసే బియ్యాన్ని రెట్టింపు చేసింది. ఏప్రిల్‌, మే నెలలో ఒక్కొక్కరికి 12 కిలోల బియ్యాన్ని ఉచితంగా అందజేస్తోంది. మరోవైపు వలస కార్మికులను గుర్తించి వారికి సైతం 12 కిలోల బియ్యం పంపిణీ చేశారు. వలస కార్మికులకు ప్రభుత్వం ఒకసారి మాత్రమే అందజేయగా, కార్డుదారులకు రెండు నెలల పాటు ఇచ్చారు.

ఇప్పటికి 450 క్వింటాళ్లు...

జిల్లా వ్యాప్తంగా రేషన్‌ దుకాణాల వద్ద ఏర్పాటు చేసిన డబ్బాల ద్వారా మంగళవారం నాటికి 450.54 క్వింటాళ్ల బియ్యాన్ని సేకరించారు. మెదక్‌ రెవెన్యూ డివిజన్‌ పరిధిలో 201.93 క్వింటాళ్లు, నర్సాపూర్‌ డివిజన్‌ 114.00 క్వింటాళ్లు, తూప్రాన్‌ డివిజన్‌ పరిధిలో 134.61 క్వింటాళ్లు సమకూరాయి.

మే నెల కోటాకు సంబంధించి కార్డుదారులు బియ్యం తీసుకెళ్లేంత వరకు దుకాణాలు తెరిచి ఉంటాయని పౌర సరఫరాల శాఖ అధికారులు ప్రకటించారు. దీంతో చాలా మంది బియ్యం వితరణ చేసే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

రేషన్‌కార్డు లేకపోవడం వల్ల చాలా మంది తమకు బియ్యం ఇవ్వాలని అధికారులను వేడుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా ఆహారభద్రతా కార్డుల కోసం 11,176 మంది దరఖాస్తు చేసుకున్నారు.

ఆపత్కాలంలో ఆకలి తీర్చేందుకు...

రేషన్‌కార్డు లేని వారిలో చాలా మంది పూటగడవని స్థితిలో ఉన్నారు. ఆపత్కాలంలో వారికి కనీసం బియ్యం అందజేస్తే ఆకలితీర్చిన వారమవుతాం. కార్డుదారులు స్పందించి తమ వంతుగా అందజేస్తున్నారు. సమకూరిన బియ్యాన్ని నిరుపేదలకు అందజేయనున్నాం.

-ధర్మారెడ్డి, జిల్లా పాలనాధికారి

ABOUT THE AUTHOR

...view details