తెలంగాణ

telangana

ETV Bharat / state

స్పందించిన మానవత్వం... ఆ కుటుంబంలో నింపింది నూతన కాంతులు

విధి వంచనకు గురైన ఆ కుటుంబానికి మానవతా మూర్తులు అండగా నిలిచారు. 'పుట్టెడు దుఃఖం' పేరుతో దివ్యాంగ కుటుంబం దీనస్థితిపై 'ఈటీవీ తెలంగాణ, ఈటీవీ భారత్​' అందించిన కథనంపై ప్రపంచ నలుమూల నుంచి మనసున్న మారాజులు స్పందించారు. ఆర్థికసాయంతోపాటు అండగా ఉంటామని మనోధైర్యం కల్పించారు. దాతల సాయంతో ఇప్పుడా కుటుంబం సొంతింటి నిర్మాణానికి భూమి పూజ చేసుకుంది.

By

Published : Oct 26, 2020, 5:13 AM IST

స్పందించిన మానవత్వం... ఆ కుటుంబంలో నూతన కాంతులు
స్పందించిన మానవత్వం... ఆ కుటుంబంలో నూతన కాంతులు

స్పందించిన మానవత్వం... ఆ కుటుంబంలో నూతన కాంతులు

మెదక్ జిల్లా నిజాంపేటకు చెందిన దివ్యాంగ కుటుంబ దీనగాథను ఇటీవల ఈటీవీ ప్రసారం చేసింది. ఆరుగురు సభ్యుల కుటుంబంలో ఐదుగురు జన్యుపరమైన సమస్యలతో బాధపడుతూ.. కనీసం కదలలేని స్థితిలో ఉన్నారు. వారిపై ఇచ్చిన కథనం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మానవతామూర్తులను కదిలించింది. తోచిన సాయం అందించి కుటుంబానికి అండగా నిలిచారు. దాతల ద్వారా సుమారుగా 30లక్షల రూపాయల సాయం అందింది. ఐదుగురు దివ్యాంగుల భారాన్ని మోస్తున్న భాగ్యలక్ష్మికి అమెరికాలో ఉద్యోగ అవకాశం కల్పించేందుకుసైతం ప్రవాసులు ముందుకొచ్చారు.

కన్నీళ్లు ఆగలేదు

ఎప్పుడు కూలుతుందో అన్నట్టు ఉన్న ఆ ఇంటిలో నివసిస్తున్న వారు.. దాతల సాయంతో కొత్త ఇంటి నిర్మాణం కోసం విజయదశమి పర్వదినాన భూమిపూజ చేశారు. ప్రముఖ సినీ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు, 'మాతృదేవోభవ' చిత్ర దర్శకులు అజయ్ కుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈటీవీలో వీరి దీనగాథను చూడగానే కన్నీళ్లు ఆగలేదన్న శ్రీనివాసరావు.... తనవంతు సాయం అందించానని పేర్కొన్నారు. వీరి పరిస్థితి సమాజం దృష్టికి తీసుకువచ్చిన ఈటీవీ బృందాన్ని ఆయన అభినందించారు. ఒక అమ్మాయి ఇంతమందికి సేవలు అందించడం ఎంతో గొప్పవిషయమంటూ.. దర్శకుడు అజయ్ కుమార్ ఉద్వేగానికి లోనయ్యారు.

మీరిచ్చిన స్ఫూర్తితో.. ముందుకు సాగుతాం

తమ జీవితంలో ఇంతటి సంతోషకర సందర్భం చూస్తామని ఎప్పుడూ అనుకోలేదని కుటుంబ సభ్యులు చెప్పారు. దాతల సాయం తమకు జీవితంపై కొత్త ఆశలు పుట్టించిందంటూ.. ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు చెప్పారు. దాతలు ఇచ్చిన స్ఫూర్తితో స్వశక్తితో ముందుకు సాగేందుకు ఈ కుటుంబం సన్నద్ధమవుతోంది.

ఇదీ చూడండి:పుట్టెడు దుఃఖంతో కుటుంబ సావాసం... నిత్యం కష్టాలతో పోరాటం

ABOUT THE AUTHOR

...view details