ఈటల రాజేందర్ భూముల సర్వే(Etela rajender land issue) రెండోరోజు కొనసాగుతోంది. ఈటల, ఆయన సతీమణి జమునకు సంబంధించిన భూముల్లో అసైన్డ్ ల్యాండ్స్ ఉన్నాయంటూ అధికారులు నోటీసులు జారీ చేశారు. సర్వే చేపట్టి నిజనిర్ధరణ చేయాల్సి ఉందన్నారు. అందులో భాగంగా మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట వద్ద రెవెన్యూ అధికారులు భూములు సర్వే చేస్తున్నారు. ఈటల కుటుంబంతో పాటు మరికొందరికి ఇటీవల అధికారులు నోటీసులిచ్చారు. అచ్చంపేటలో 77 నుంచి 82 సర్వే నంబర్లలో అధికారులు సర్వే చేస్తున్నారు. మంగళవారం ప్రారంభమైన సర్వే ఇవాళ కూడా కొనసాగుతోంది. గురువారం హకీంపేటలోని భూములను రెవెన్యూ అధికారులు సర్వే చేయనున్నారు.
మొదటి రోజు సర్వే
మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేటలోని మాజీ మంత్రి ఈటల రాజేందర్ భూముల్లో అధికారులు మొదటి రోజు సర్వే(etela rajender land survey) మంగళవారం చేపట్టారు. ఈటలకు చెందిన జమున హేచరీస్(Jamuna hatcheries) భూముల్లో రెవెన్యూ అధికారులు సర్వే చేశారు. అచ్చంపేట పరిధిలోని 130 సర్వే నంబర్‌లోని 18ఎకరాల 35గుంటల భూమిని సర్వే చేసి.. సబ్ డివిజన్ వారీగా హద్దులు ఏర్పాటు చేశారు. ఇందులో అధికారులతో పాటు 20మంది రైతులు, ఇద్దరు జమున హేచరీస్ ప్రతినిధులు పాల్గొన్నారు. అధికారులు, రైతులను పూర్తిగా శానిటైజ్ చేసిన తర్వాత జమున హేచరీలోకి నిర్వాహకులు అనుమతించారు. ఈనెల 18న హకీంపేట పరిధిలోని భూములను సర్వే(Etela Hakeem pet lands' survey) చేయనున్నారు. గురువారం వరకు సర్వే చేయనున్నట్లు అధికారులు తెలిపారు. సర్వే జరుగుతున్న సమయంలో ఈటల అనుకూల, వ్యతిరేక వర్గాలు... జమున హేచరీ ముందు నిరసనకు దిగాయి. వారికి పోలీసులు నచ్చజెప్పి పంపిచారు.