కరోనా రెండో దశ విజృంభించిన నేపథ్యంలో ప్రభుత్వం లాక్‌డౌన్ విధించినా ఉపాధి హామీ పనులకు మినహాయింపు ఉండటంతో మెదక్ జిల్లాలో జోరుగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం వ్యవసాయ పనులు పెద్దగా లేకపోవడంతో ఉపాధి హామీ పథకం వైపు కూలీలు మొగ్గు చూపుతున్నారు. 2020లో వంద రోజులు పని పూర్తి చేసుకున్న వారికి తిరిగి పని చేసే అవకాశం లభించడంతో ప్రతిరోజూ అర లక్షకు మించి కూలీలు పనుల్లో నిమగ్నమవుతున్నారు. ఆర్థిక సంవత్సరం ప్రారంభ నెలలోనే లక్ష్యానికి మించి పని దినాలు కల్పించారు. లాక్‌డౌన్ కారణంగా ఉపాధి నిమిత్తం వలసవెళ్లిన వారు స్వగ్రామాలకు వస్తున్నారు. వారంతా పనిలో చేరేందుకు మొగ్గు చూపనుండగా ఈ నెలాఖరుకు సగటున ఎనభై వేలకు పైగా కూలీలు పనులు పాల్గొనే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.
వలసలు నివారించేందుకు, ఉన్న ఊరిలో పనులు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ పథకం ద్వారా 190 రకాల పనులు చేపట్టే అవకాశం ఉండగా కూలీలు సద్వినియోగం చేసుకుంటున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మెదక్ జిల్లా ఉపాధి హామీ పనుల కల్పనలో రాష్ట్రంలో తృతీయ స్థానంలో నిలిచింది. నిరుడు నిర్దేశించిన 78.34 లక్షల పనిదినాలకు 57.63 లక్షలు పూర్తయ్యాయి. 2.01 లక్షల మంది కూలీలు పనుల్లో పాల్గొనగా వారికి కూలి రూపేణా రూ.96.46 కోట్లు చెల్లించారు. గరిష్ఠంగా ఒక రోజు 1.20 లక్షల మంది కూలీలు పనికి హాజరైనట్లు తేల్చారు. 11,763 కుటుంబాలు వంద రోజులు పూర్తి చేసుకున్నాయి.
లక్ష్యం దిశగా...
2021-22 ఆర్థిక సంవత్సరంలో 78.34 లక్షల పనిదినాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటికే ఏప్రిల్ నెలలో లక్ష్యానికి మించి పూర్తి కావడం గమనార్హం. మే నెలలో ఇప్పటికే 62.14 శాతం పని దినాలు పూర్తయ్యాయి. రోజుకు సగటున అర లక్షకు పైగా కూలీలు పనుల్లోకి వస్తుండగా, రానున్న రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరగనుంది. ఇప్పటి వరకు 170 కుటుంబాలు వందరోజుల పనిదినాలు పూర్తి చేసుకున్నాయి. ఎండల కారణంగా ఉదయం, సాయంత్రం వేళల్లో ఉపాధి పనులు నిర్వహించుకునే వెసులుబాటు ఉండటంతో కూలీలు ఆసక్తి చూపుతున్నారు. ఇందులో భాగంగా పంట పొలాలకు దారులు వేయడం, పంటకాల్వలు శుభ్రం చేయడం, చెరువుల్లో పూడికతీత, నీటి నిల్వ కందకాలు, అటవీప్రాంతాల్లో గుంతలు తీయడం, హరితహారంలో భాగంగా నర్సరీల్లో మొక్కల పెంపకం తదితర పనులు చేపడుతున్నారు.