Dog Feeds lamb: సృష్టిలో వెలకట్టలేనిది అమ్మ ప్రేమ. తాను ఆకలితో ఉన్నా.. బిడ్డ కడుపు నింపాలని అమ్మ ఆరాటపడుతుంది. తన కడుపున పుట్టకున్నా.. ఏ బిడ్డ ఆకలితో అల్లాడినా తల్లి మనసు తట్టుకోలేదు. అలాంటి మూర్తీభవించిన మాతృ ప్రేమను కళ్లారా మరోసారి చూపించింది ఓ శునకం.
మెదక్ జిల్లా మాసాయిపేట మండలం పోతాన్శెట్టిపల్లి గ్రామానికి చెందిన రవీందర్.. ఓ గొర్రె పిల్లను కొనుగోలు చేసి పెంచుకుంటున్నారు. దానికి తల్లి లేకపోవడంతో ఉదయం, సాయంత్రం... రెండు పూటలా ఆయనే పాలు పడుతున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 5న సాయంత్రం పనిమీద రవీందర్ బయటకు వెళ్లాడు. తిరిగి వచ్చేసరికి కొంత ఆలస్యమైంది. అప్పటికే యజమాని రాక కోసం ఆతృతగా ఎదురుచూస్తున్న గొర్రె పిల్లకు.. ఆయన ఇంకా రాకపోయేసరికి నిరాశకు గురైంది.
ఓ వైపు ఆకలితో కడుపులో పేగులు మెలిపెడుతున్నాయి. మరోవైపు.. ఇంట్లో ఎవరైనా ఉన్నారా.. తన ఆకలి తీరుస్తారా..? అని చూస్తే.. ఇంటికి తాళం వేసి ఉంది. ఇక చేసేదేం లేక యజమాని ఎప్పుడొస్తాడా..? తనకెప్పుడు పాలు పడతారా..? అని కళ్లు కాయలు కాచేలా ఎదురుచూడటమే తనవంతైంది. సమయం గడిచేకొద్దీ ఆకలితో గొర్రెపిల్ల నీరసించిపోయింది. డీలా పడిపోయిన గొర్రెపిల్ల అలా కూర్చుండిపోయింది. కాసేపటికి ఓ శునకం తనకెదురుగా కనిపించింది. అది తన పిల్లలకు పాలు పడుతోంది. ఇక అంతే ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. పరిగెత్తుకుంటూ ఆ శునకం దగ్గరకు వెళ్లింది.