మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేటలోని మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు చెందిన జమున హేచరీస్ ఆక్రమణలో ఉన్న భూములను.. కబ్జాకు గురైన బాధితులకు పంపిణీ చేశారు. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి బాధితులకు పట్టాలు అందించారు. సర్వే నంబర్ 79, 130ల్లోని 85.5 ఎకరాలను 64 మంది రైతులకు పంపిణీ చేశారు. మొత్తం ప్రక్రియ పూర్తి అయిన అనంతరం వారికి రైతుబంధు, పంటల సాగు కోసం ప్రత్యేక రుణాలు, సబ్సిడీలు అందిస్తామని హామీ ఇచ్చారు.
కబ్జాకు గురైన బాధితులకు పట్టాలు పంపిణీ చేసే సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తూప్రాన్ డీఎస్పీ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తమ భూములను తిరిగి తమకు అందించారంటూ రైతులు ఆనందం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలతో అభిషేకం చేశారు.