తెలంగాణ

telangana

ETV Bharat / state

Agriculture: సాగు ఖర్చులు పెరిగి గిట్టుబాటు కాని పంటలు.. ఇక రైతన్నలకు దిగులే దిగుబడి! - Cultivation costs have risen

సాగు ఖర్చులు పెరిగాయి. పంటలు గిట్టుబాటు కాలేదు. పత్తి మినహా మిగతా వాటికి ధర, డిమాండు కరవైంది. ఈ వానాకాలం సీజన్‌ అన్నదాతలకు కలిసిరాలేదు. డీజిల్‌ ధరల పెరుగుదల ప్రభావం అన్నింటిపైనా తీవ్రంగా పడింది. సాగు ఖర్చులు, మార్కెట్లలో వాటికి లభిస్తున్న ధరలపై ‘ఈనాడు-ఈటీవీ భారత్​’ క్షేత్రస్థాయి పరిశీలనలో రైతులు తమ కష్టాలు వివరించారు.

Agriculture
Agriculture

By

Published : Nov 10, 2021, 6:43 AM IST

వానాకాలం పంటల సాగు చాలామంది రైతులకు నిరాశే మిగిల్చింది. అధిక వర్షాలు, తేమ వల్ల చుట్టుముట్టిన తెగుళ్లతో పంటల దిగుబడి అంతంతమాత్రంగానే వచ్చింది. డీజిల్‌, కూలి రేట్లు, యంత్రాల కిరాయిలు విపరీతంగా పెరగడంతో పంటలు కోసి మార్కెట్లకు తీసుకెళ్లాలన్నా వేలాది రూపాయలు వెచ్చించాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. డీజిల్‌ ధరల పెరుగుదల ప్రభావం అన్నింటిపైనా తీవ్రంగా పడిందని, సాగు ఖర్చులు బాగా పెరిగాయని చెప్పారు. సాగు ఖర్చులు, మార్కెట్లలో వాటికి లభిస్తున్న ధరలపై ‘ఈనాడు-ఈటీవీ భారత్​’ క్షేత్రస్థాయి పరిశీలనలో రైతులు తమ కష్టాలు వివరించారు. ‘‘సాధారణంగా వాతావరణం అనుకూలిస్తే 20 నుంచి 25 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ప్రస్తుత సీజన్‌లో అధిక వర్షాలు, తెగుళ్ల కారణంగా 15 నుంచి 20 క్వింటాళ్లలోపే దిగుబడి వచ్చినట్లు చెప్పారు. కొనుగోలు కేంద్రాల్లో 40 కిలోల బస్తాకు 43 కిలోల ధాన్యం తూకం వేసి తీసుకుంటున్నారని మెదక్‌ జిల్లా రాజ్‌పల్లి గ్రామ కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తెచ్చిన రైతులు సత్యనారాయణ, యాదగిరి, రాజు, ప్రభాకర్‌ తదితరులు ‘ఈనాడు-ఈటీవీ భారత్​’తో ఆవేదన వ్యక్తం చేశారు. రోజుల తరబడి ఎదురుచూడలేక, వర్షాలు పడితే తడిసిపోయి ధర తగ్గిస్తారనే భయంతో కొందరు రైతులు బస్తాకు 3 కిలోలు అదనంగా తీసుకున్నా ఫర్వాలేదు త్వరగా తూకం వేసి తీసుకోవాలని కొనుగోలు కేంద్రాల వారిని ప్రాధేయపడుతున్నారు.

పెట్టుబడీ రావడంలేదు

పత్తి పంటకు ధర బాగున్నా దిగుబడి సరిగా రాక నష్టాలే మిగిలినట్లు మెదక్‌ జిల్లా రైతు రాజయ్య చెప్పారు. పెసర మొత్తం నాశనమైందని వికారాబాద్‌, జనగామ రైతులు వివరించారు. పత్తి, పెసరకు మద్దతు ధర ఉన్నా పంట దిగుబడి రాక ఏం మిగలడం లేదని, పెట్టుబడి కూడా చేతికి రావడం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటివరకూ ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలుకు మాత్రమే కేంద్రాలు తెరుస్తోంది. మిగిలిన పంటలేవీ కొనడం లేదు. వడ్ల కొనుగోళ్లు పూర్తిస్థాయిలో ప్రారంభం కాకపోవడంతో అప్పుల చెల్లించాల్సినవారు, సొమ్ము అవసరమైన రైతులు వ్యాపారులిచ్చిన ధరలకు తెగనమ్మకుంటున్నారు. మొక్కజొన్నకు వ్యాపారులు మద్దతు ధర కూడా ఇవ్వడం లేదు.

కిరాయి భారం

డీజిల్‌, కూలీ రేట్లు, యంత్రాల కిరాయి గణనీయంగా పెరగడంతో పంట సాగు ఖర్చులు అధికమై ఏమీ మిగలడం లేదని రైతులు తెలిపారు. గతేడాది వరి కోత యంత్రానికి గంటకు రూ.2,000 నుంచి 2,400 వరకూ తీసుకుంటే ఇప్పుడు రూ. 2,500 నుంచి 3,300 దాకా వసూలు చేస్తున్నారు. వరి ధాన్యాన్ని గ్రామంలోనే ఉన్న కొనుగోలు కేంద్రానికి కిలోమీటరు దూరం తీసుకెళ్లినా ట్రాక్టర్‌ కిరాయి రూ.500 నుంచి 1000 వసూలు చేస్తున్నారు. ఎకరా పంటను కొనుగోలు కేంద్రానికి తీసుకెళ్లాలంటే కనీసం రూ.4 వేల ఖర్చవుతోంది. వరికోతలకు పెరిగిన ఖర్చులు, తరలింపునకు అదనంగా చెల్లిస్తున్నది, తరుగు వంటి వాటిని లెక్కేస్తే రాష్ట్రం మొత్తం మీద రైతులు కోల్పోతున్న సొమ్ము రూ. 2,500 కోట్ల వరకు ఉంటుందని మార్కెటింగ్‌ అధికారి ఒకరు ‘ఈనాడు’కు వివరించారు. విత్తనం కొనుగోలు, దుక్కుల నుంచి మొదలుపెడితే సాగుఖర్చులకు తగినంత ఆదాయం వరి రైతులకు రాని మాట వాస్తవమేనని ఆయన చెప్పారు.

ధర పెరిగినా లాభం లేకపోయే

పత్తికి ధర బాగా పెరిగినా ఏం లాభం? నాకు సాగు ఖర్చులు కూడా తిరిగి రాలేదు. రూ.లక్షా 80 వేలు ప్రైవేటు వడ్డీకి, బ్యాంకు నుంచి మరో రూ.60 వేలు అప్పు తెచ్చి 10 ఎకరాల్లో పత్తి సాగుచేశాను. అధిక వర్షాలతో పూత, కాత రాలి, తెగుళ్లు సోకి పంట దెబ్బతింది. ఎకరానికి 3 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. పెట్టుబడి ఎకరానికి రూ.35 వేలు దాటింది. క్వింటాకు రూ.8 వేలిచ్చినా నాకు ఇంకా ఎకరానికి రూ.11 వేల చొప్పున 10 ఎకరాలకు రూ.లక్షకు పైగా నష్టమే. పంట లేనందుకే వ్యాపారులు ధరలు పెంచారు.

ఖర్చులు పెరిగినయ్‌..

అప్పులు తెచ్చి వరి సాగుచేశాను. సాగు ఖర్చులు బాగా పెరిగాయి. కోత యంత్రానికి గంటకు రూ. 2,700 తీసుకుంటున్నారు. అన్ని ఖర్చులు లెక్కేస్తే ఏమీ మిగలడం లేదు. కూలీల ఖర్చులు భరించలేక మా కుటుంబ సభ్యులమే పనులు చేసుకుంటున్నాం. ఎకరానికి 15 క్వింటాళ్లు కూడా రాలేదు. మద్దతు ధర ఇచ్చినా మాకేం మిగలదు. వ్యాపారులు ఇంకా తక్కువకు అడుగుతున్నారు.

-బస్తీ నత్తాసింగ్‌, పత్తి రైతు, ధర్మసాగర్‌ గ్రామం, ఇంద్రవెల్లి మండలం, ఆదిలాబాద్‌ జిల్లా

మండుటెండలో వృద్ధ రైతు దంపతుల శ్రమ

గడ్డిమోపు కడుతున్న ఈ వృద్ధుని పేరు కిష్టయ్య, ఆయన భార్య లలిత. సంగారెడ్డి జిల్లా దౌలాపూర్‌ గ్రామంలో 2 ఎకరాల్లో వరి సాగుచేశారు. కూలి ధరలు పెరగడంతో భరించలేక భార్యతో కలసి గడ్డి మోపులు కట్టి మోసుకెళ్తున్నారు. కూలి రోజుకు రూ.300 నుంచి 500 అడుగుతున్నారని, డీజిల్‌ ధర పెంపు వల్ల ట్రాక్టర్‌ కిరాయిలు కూడా భారమవడంతో అంత చెల్లించలేక వృద్ధులమైనా తామే పని చేసుకుంటున్నామని ఆ దంపతులు చెప్పారు.

-నల్లపద్మ, గిరిజన మహిళా రైతు రంగంపేట, కొల్చారం మండలం, మెదక్‌ జిల్లా

ఇదీ చూడండి:అటవీ సిబ్బందిని అడ్డుకున్న పోడు భూముల రైతులు.. ఉద్రిక్తత

ABOUT THE AUTHOR

...view details