తెలంగాణ

telangana

ETV Bharat / state

ముంచెత్తిన అకాల వర్షాలు.. వడగళ్ల వానతో అతలాకుతలమైన అన్నదాతలు - rains in telangana

Crop Damage Due to Rain: ఉమ్మడి మెదక్‌, నిజామాబాద్‌ జిల్లాల్లోని అన్నదాతలను అకాల వర్షం అతలాకుతలం చేసింది. వడగళ్ల వానతో వరి రైతులు బెంబేలెత్తిపోయారు. కొనుగోలు కేంద్రాల్లో పోసిన ధాన్యం రాశులు తడిసి ముద్దయ్యాయి. ఇళ్ల పైకప్పులు ఎగరిపోవడంతో పాటు విద్యుత్ స్తంభాలు, చెట్లు నెలకొరిగాయి. త్వరగతిన తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి ప్రభుత్వం ఆదుకోవాలంటూ రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.

ముంచెత్తిన అకాల వర్షాలు.. వడగళ్ల వానతో అతలాకుతలమైన అన్నదాతలు
ముంచెత్తిన అకాల వర్షాలు.. వడగళ్ల వానతో అతలాకుతలమైన అన్నదాతలు

By

Published : Apr 30, 2022, 2:02 PM IST

ముంచెత్తిన అకాల వర్షాలు.. వడగళ్ల వానతో అతలాకుతలమైన అన్నదాతలు

Crop Damage Due to Rain: ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈదురు గాలులు, ఉరుములు మెరుపులతో వర్షం హోరెత్తింది. చేతికి వచ్చిన పంట పొలాలు నేలకొరగగా.. ఆరబెట్టిన ధాన్యం తడిసిముద్ధయ్యింది. ధాన్యం కోతలు ప్రారంభమవ్వగా.. కొందరు రోడ్లమీద, పొలాల వద్ద ఆరబెట్టుకోగా.. మరికొందరు కొనుగోలు కేంద్రాల వద్ద ఆరబెట్టుకున్నారు. అకస్మాత్తుగా కురిసిన వర్షంతో ధాన్యం తడవడంతో పాటు వరదకు కొట్టుకొని పోయింది. కొన్ని ప్రాంతాల్లో వడగళ్లు సైతం పడటంతో మామిడికి స్పల్ప నష్టం ఏర్పడింది. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. మెదక్‌ జిల్లాలో హవేలిఘనపూర్, చేగుంట, కొల్చారం, వెల్దుర్తి, రామాయంపేట మండలాలతో పాటు.. నర్సాపూర్ పట్టణంలో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి, దుబ్బాక, గజ్వేల్, ములుగు, కోహెడ మండలాల పరిధిలో తీవ్రత ఎక్కువగా ఉంది. ప్రభుత్వం వెంటనే స్పందించి తడిసిన ధాన్యం కోనుగోలు చేయాలని.. ఆలస్యమైతే వడ్లు మొలకెక్కుతాయని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

"అనుకోకుండా ఒకేసారి వడగండ్ల వాన మొదలైంది. ధాన్యం కుప్పలపై పట్టాలు కప్పేలోపే మొత్తం తడిసి ముద్దయింది. ఆలస్యమైతే ధాన్యం మొలకెత్తే అవకాశం ఉంది. ప్రభుత్వం స్పందించి వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్​ చేస్తున్నాం." -రైతు

దుఃఖాన్ని మిగిల్చిన వడగండ్లు: ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో ఆరుగాలం కష్టించి సాగు చేసిన పంట.. కళ్లముందే కడగండ్లు మిగిల్చింది. పలు మండలాల్లో వడగండ్ల వర్షం రైతులకు దుఃఖాన్ని మిగిల్చింది. అనేక చోట్ల వరి నేల వాలిపోయింది. వడ్లు నేలరాలిపోయాయి. కోత దశలో ఇలా జరగడంతో రైతులు ఆందోళనలో మునిగిపోయారు. నిజామాబాద్ జిల్లాలో సిరికొండ, దర్పల్లి, ఇందల్వాయి మండలాల్లో అకాల వర్షం కురిసింది. సిరికొండ, దర్పల్లిలో అధికంగా వరి పైరు దెబ్బతింది. సిరికొండ మండలం చీమన్ పల్లి, పందిమడుగు గ్రామాల్లో చేతికొచ్చిన పంట నీటిలో తడసిపోయింది. 15 రోజుల్లో రెండు సార్లు వర్షం పడటంతో రైతు నెత్తిన పిడుగు పడ్డట్టయిందని.. అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

"కోతలు కోసి 15 రోజులు అవుతోంది. వాన పడటంతో ధాన్యం నానిపోయింది. ఎంతో గోస పడుతున్నాం. మేము ఆరుగాలం కష్టపడి ఇట్ల నష్టపోయే పరిస్థితి వచ్చింది." -రైతు

ముంచిన వాన: కామారెడ్డి జిల్లాలో బిక్కనూర్, బీబీపేట మండలాల్లో వడగండ్ల వాన కురిసింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సుమారు 500ఎకరాల్లో పంట దెబ్బతిన్నట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేస్తున్నారు. ఒక్క సిరికొండ మండలంలోనే దాదాపు 250 ఎకరాల్లో వరి పంటకు నష్టం దెబ్బతిన్నదని అధికారులు చెబుతున్నారు. అకాల వర్షాలతో నష్టపోయిన తమను పరిహారం ఇప్పించి ఆదుకోవాలని అన్నదాతలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.

"ఈ రాళ్ల వర్షంతో వరిపంటకు చాలా నష్టం జరిగింది. రెవెన్యూ వారితో కలిసి రెండు గ్రామాల్లో 100 శాతం సర్వే చేపడుతున్నాం. ఫైనల్​ సర్వే చేపట్టిన అనంతరం ఎంత నష్టం జరిగిందనేది ప్రభుత్వానికి నివేదిక పంపిస్తాం." -ప్రదీప్, ఏడీఏ, నిజామాబాద్ రూరల్

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details