అంబానీ, అదానీ వంటి ధనవంతులకు కొమ్ము కాస్తూ.. కేంద్ర ప్రభుత్వం పూర్తిగా రైతు వ్యతిరేక విధానాలను అనుసరిస్తోందని సీపీఎం మెదక్ కార్యదర్శి మల్లేశం ఆరోపించారు. 3 సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా కేంద్రం రాందాస్ చౌరస్తాలో డిసెంబర్ 20ని దేశవ్యాప్తంగా రైతు అమరవీరుల దినంగా ప్రకటిస్తూ.. అమరులైన అన్నదాతలకు పలు ప్రజాసంఘాల నాయకులతో కలిసి ఆయన నివాళులు అర్పించారు.
దిల్లీలో రైతులు చేస్తోన్న పోరాటాన్ని కేంద్రం వక్రీకరిస్తోందని విమర్శించారు. ఈ రైతు పోరాటంలో నవంబర్ 26 నుంచి నేటి వరకు 33 మంది రైతులు వీరమరణం పొందారని పేర్కొన్నారు. దేశానికి అన్నం పెట్టే అన్నదాతలు రోడ్డు మీద నిరసన కార్యక్రమాలు చేస్తుంటే.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీలను ఆకర్షించడానికి ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. మతోన్మాద శక్తులు రైతులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.