సన్న రకం వరి ధాన్యానికి ప్రభుత్వం రూ.2500 గిట్టుబాటు ధర కల్పించాలంటూ కాంగ్రెస్ నాయకులు, రైతులు ధర్నా చేపట్టారు. మెదక్ జిల్లా చిన్నశంకరం పేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పిలుపుతో నాయకులు సన్న రకం ధాన్యానికి మద్దతు ధర కల్పించాలంటూ సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. రైతులను సన్న రకం వరి పంట వేయాలని చెప్పి... ఆయన వేరే ధాన్యాన్ని పండించడం ఎంతవరకు సమంజసం అంటూ రైతులు సీఎం కేసీఆర్ని ప్రశ్నించారు. ఈ నెల 10 వరకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని నాయకులు డిమాండ్ చేశారు. లేకపోతే ఉద్యమం ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
'కేంద్రం నిధులతోనే...'
మెదక్ - చేగుంట రహదారిపై ఆందోళనకు దిగారు. అనంతరం పోలీస్ స్టేషన్ ముందు నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన డబ్బులతోనే రైతు వేదికలు, డంపింగ్ యార్డ్, వైకుంఠధామాలు ఏర్పాటు చేసి ప్రభుత్వం ప్రజలను బురిడీ కొట్టిస్తోందని స్థానిక సర్పంచ్ రాజిరెడ్డి ఆరోపించారు. రైతుల శ్రేయస్సు కోసం ప్రగతి భవన్ ముట్టడికి సిద్ధంగా ఉన్నామని మెదక్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు తిరుపతి రెడ్డి వెల్లడించారు.