మెదక్ జిల్లా పచ్చదనంతో పరిశుభ్రంగా ఉండడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కలెక్టర్ ఎస్.హరీశ్ విజ్ఞప్తి చేశారు. కలుషిత వాతావరణం నుంచి మానవజాతిని కాపాడటానికి మొక్కల పెంపకం ఎంతో అవసరమని అన్నారు. పచ్చదనానికి సీఎం కేసీఆర్ ఎంతో ప్రాముఖ్యతనిచ్చి తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారని తెలిపారు. మెదక్ పట్టణం వెంకట్రావు నగర్ కాలనీలోని నర్సరీని, హౌసింగ్ బోర్డులో ప్రకృతి వనం, నర్సరీలను మున్సిపల్ కమిషనర్ శ్రీహరితో కలిసి శనివారం పరిశీలించారు.
ఆకుపచ్చ తెలంగాణ
భూభాగంలో 33 శాతం మేర అడవులు విస్తరించి ఉండాలని, నేడు నగరాలు విస్తరిస్తుండడం వల్ల అడవులు తగ్గిపోతున్నాయని తెలిపారు. పర్యావరణ సమతుల్యం దెబ్బతిని ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తున్నాయని అన్నారు. ఆకుపచ్చ తెలంగాణ కోసం హరిత హారం కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందని గుర్తు చేశారు. ఈ సారి జిల్లాలో 35 లక్షలకు పైగా మొక్కలు నాటేందుకు ప్రణాళిక రూపొందించి... 469 నర్సరీల్లో మొక్కలు పెంచుతున్నామని పేర్కొన్నారు.