తెలంగాణ

telangana

ETV Bharat / state

హరితహారానికి 'ఆరో' మెట్టు.. నేడే శ్రీకారం - ఆరోవిడత హరితహరం ప్రారంభించనున్న సీఎం కేసీఆర్

ఆరో విడత హరితహరానికి రంగం సిద్ధమైంది. మెదక్ జిల్లా నర్సాపూర్ అటవీప్రాంతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మొక్క నాటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. గత ఐదేళ్లుగా 180 కోట్ల మొక్కలు నాటగా ఈ దఫాలో మరో 30 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అటవీ ప్రాంతాల అభివృద్ధి సహా యాదాద్రి నమునాలో రాష్ట్ర వ్యాప్తంగా చిట్టడవుల రూపంలో ప్రకృతివనాల అభివృద్ధికి ఈ విడతలో ప్రాధాన్యం ఇవ్వనున్నారు. కరోనా నేపథ్యంలో కొవిడ్ నిబంధనలకు లోబడి హరితహారం కార్యక్రమాన్ని చేపట్టనున్నారు.

haritha haram
హరితహారానికి 'ఆరో' మెట్టు.. నేడే శ్రీకారం

By

Published : Jun 24, 2020, 5:12 PM IST

Updated : Jun 25, 2020, 7:24 AM IST

నూతన తెలంగాణ రాష్ట్రాన్ని ఆరోగ్యకరమైన, ఆహ్లాదకరంగా, అత్యంత నివాస యోగ్యంగా మార్చే ప్రయత్నంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని చేపట్టింది. ఐదేళ్ల క్రితం ప్రారంభమైన ఈ ఆకుపచ్చ యజ్ఞం ఆరో ఏడాదిలోకి అడుగు పెడుతోంది. ప్రభుత్వ సంకల్పం, అన్ని వర్గాల ప్రజల సహకారంతో గత ఐదు విడతల్లో నాటిన మొక్కలు, వాటి ఫలితాలు ఇప్పుడు కళ్ల ముందు కనిపిస్తున్నాయి. హరితహారం కార్యక్రమంలో భాగంగా 230 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పచ్చదనం పెంపునకు సంబంధించి ఇది ప్రపంచంలో మూడో అతిపెద్ద మానవప్రయత్నం. ఐదు విడతల్లో భాగంగా ఇప్పటివరకు రాష్ట్రంలో 180 కోట్ల మొక్కలు నాటారు. అందులో 70 శాతం వరకు మొక్కలు బతికాయని ఓ అంచనా.

లక్ష్యం పెరిగింది

ఐదు విడతల కార్యక్రమం అమలు, అనుభవాల నేపథ్యంలో ఆరోవిడత హరితహారం కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆరోవిడత హరితహారం కార్యక్రమం ప్రారంభం కానుంది. మెదక్ జిల్లా నర్సాపూర్ అటవీ పునరుద్ధరణ కార్యక్రమంలో భాగంగా మొక్కను నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోవిడత కార్యక్రమానికి శ్రీకారం చుడతారు. ఆరో దఫాలో భాగంగా 30 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మొదట 20 కోట్ల లక్ష్యాన్ని నిర్ధేశించుకున్నప్పటికీ పట్టణ ప్రాంతాల్లో ఎక్కువ మొక్కలు నాటాలన్న ముఖ్యమంత్రి ఆదేశాలతో లక్ష్యం పెరిగింది. మొదట పట్టణప్రాంతాల్లో కేవలం రెండున్నర కోట్ల మొక్కలు నాటాలనుకున్నప్పటికీ ఇపుడు 12.5 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

బతుకపోతే చర్యలు తప్పవు

పచ్చదనం పెంపు అంశాన్ని పంచాయతీరాజ్, పురపాలక చట్టాల్లో ప్రత్యేకంగా పేర్కొన్న ప్రభుత్వం... అన్ని స్థానికసంస్థల్లోనూ విధిగా పది శాతం బడ్జెట్‌ను పచ్చదనం పెంపు కోసం గ్రీన్ బడ్జెట్ పేరిట కేటాయించాలని స్పష్టం చేసింది. నాటిన మొక్కల్లో కనీసం 85 శాతం బతుకపోతే సంబంధిత ప్రజాప్రతినిధులు, అధికారులపై చర్యలు తీసుకునే అధికారాన్ని కూడా చట్టంలో పొందుపర్చింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని పట్టణాలతో పాటు గ్రామాల్లో నర్సరీలను ఏర్పాటు చేసి మొక్కలను పెంచుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా పట్టణ, గ్రామీణప్రాంత నర్సరీల్లో 21.16 కోట్ల మొక్కలు సిద్ధంగా ఉన్నాయి. అటవీశాఖ నర్సరీల్లో మరో 2.16 కోట్ల పెద్ద మొక్కలు, కంపా నిధులతో నాటేందుకు మరో 1.42 కోట్ల మొక్కలు మొత్తంగా 24.74 కోట్ల మొక్కలు నాటేందుకు అనువుగా ఉన్నాయి. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా కోటి చింత మొక్కలు నాటాలనే లక్ష్యంతో గ్రామపంచాయతీ నర్సరీల్లో 81.69 లక్షలు, ఆటవీశాఖ ఆధ్వర్యంలో 24.5 లక్షల చింతమొక్కలను సిద్ధం చేశారు.

వీటిపై ప్రత్యేక దృష్టి

ఆరోవిడత హరితహారంలో కొన్నింటిపై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించనున్నారు. జంగల్ బచావో - జంగల్ బడావో నినాదానికి అనుగుణంగా ఆటవీప్రాంతాల్లో మొక్కలు నాటి సంరక్షణా చర్యలు చేపట్టనున్నారు. సహజ సిద్ధమైన అడవుల పరిరక్షణ, పునరుజ్జీవం లాంటి చర్యలను ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా అటవీ ప్రాంతాల్లో చేపట్టగా వాటిని మరింత ఉద్ధృతం చేయనున్నారు. ఈ విడతలో టేకు, సరుగుడు, చింత, పూలు, పండ్ల మొక్కలకు ప్రాధాన్యత ఇస్తారు. ప్రతీ జిల్లాలో ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో యాదాద్రి నమూనాలో తక్కువ స్థలంలో ఎక్కువ మొక్కలతో చిట్టడవులను అభివృద్ధి చేయడంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. పట్టణ ప్రాంతాలతో పాటు రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో ఈ తరహాలో ప్రకృతివనాలను అభివృద్ధి చేయాలని ఆదేశించారు. ఇందుకోసం ఉపాధిహామీ పథకం నిధులను ఉపయోగించుకోవాలని తెలిపారు.

95 అర్బన్ ఫారెస్ట్‌లు

పాఠశాలలు, కళాశాలలు, సంక్షేమ హాస్టళ్లు, విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలు, చెరువులు, కాలువలు, ప్రాజెక్టుల వద్ద మొక్కలు నాటేలా చర్యలు తీసుకుంటారు. కోతుల బెడద నివారణ కోసం ప్రత్యేకంగా గుర్తించిన 37 రకాల మొక్కల జాతులను క్షీణించిన అటవీ ప్రాంతాల్లో నాటేలా ప్రణాళికలు రూపొందించారు. ఆగ్రో ఫారెస్ట్రీకి ప్రాధాన్యం ఇచ్చి రైతులకు అదనపు, ప్రత్యామ్నాయ ఆదాయ వనరుల పెంపుపై దృష్టి సారిస్తారు. కేంద్ర వెదురు ప్రోత్సాహక సంస్థ సహకారంతో చిన్న, సన్నకారు రైతులకు ఆదాయ వనరుగా వెదురు పెంపకాన్ని హరితహారం కింద ప్రోత్సాహిస్తారు. హరిత తెలంగాణ, ఆరోగ్య తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా చేపట్టిన అర్బన్ ఫారెస్ట్ పార్కుల్లో ప్రత్యేకంగా హరితహారం కార్యక్రమం చేపడతారు. పట్టణప్రాంత వాసులకు స్వచ్ఛమైన గాలిని అందించే ఆక్సిజన్ కర్మాగారాలుగా పనిచేసేలా 95 అర్బన్ ఫారెస్ట్ బ్లాకుల అభివృద్ధిని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ఇందులో 35 పూర్తి కాగా మిగిలిన పనులు వివిధ దశల్లో ఉన్నాయి.

కరోనా నిబంధనలు తప్పనిసరి

గ్రామీణ ప్రాంతాల్లో మొక్కలు నాటి, సంరక్షించేందుకు ఉపాధిహామీ నిధులను వినియోగిస్తున్నారు. గ్రామాల్లో కొత్తగా నిర్మించిన, నిర్మిస్తున్న వైకుంఠధామాలు, డంపింగ్ యార్డుల చుట్టూ కూడా పెద్దపెద్ద మొక్కలు నాటి హరితగోడలను నిర్మించాలని ముఖ్యమంత్రి ఇప్పటికే స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అన్ని జాతీయ, రాష్ట్ర రహదారుల వెంట మొక్కలు నాటి సంరక్షించే కార్యక్రమాన్ని ఇకనుంచి నిరంతరాయంగా కొనసాగించనున్నారు. హైవేల కోసం ప్రత్యేకంగా నర్సరీలను కూడా ఏర్పాటు చేయనున్నారు. ఆరోవిడత హరితహారం కోసం ఆయా శాఖలు ఇప్పటికే కసరత్తు వేగవంతం చేశాయి. మంత్రులు, ఉన్నతాధికారులు గత కొన్నాళ్లుగా సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తూ ప్రణాళికలను సమీక్షిస్తున్నారు. కరోనా నేపథ్యంలో కొవిడ్ నిబంధనలకు లోబడి హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. భౌతికదూరం పాటించడం, మాస్కులు విధిగా ధరించేలా చూడాలని అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే ఆదేశించారు.

ఇదీ చదవండి:పింఛన్ల కోతపై వివరణివ్వండి.. సర్కార్​కు హైకోర్టు నోటీసులు

Last Updated : Jun 25, 2020, 7:24 AM IST

ABOUT THE AUTHOR

...view details