CM KCR Public Meeting at Medak :పార్టీల నడవడికను చూసి ఓటు వేయాలని బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR)అన్నారు. ప్రజల చేతిలో ఉన్న విలువైన ఆయుధం ఓటు అని పేర్కొన్నారు. మెదక్ ప్రజా ఆశీర్వాద సభ(Praja Ashirvada Sabha)లో పాల్గొన్న సీఎం కేసీఆర్ ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తలరాతను మార్చే ఓటును జాగ్రత్తగా ఆలోచించి వేయాలని సూచించారు. తెలంగాణ ప్రజల కోసం పుట్టిందే బీఆర్ఎస్ పార్టీ అని స్పష్టం చేశారు. తెలంగాణ ఏర్పడేనాటికి రాష్ట్రంలో కరెంట్, సాగునీరు, తాగునీరు లేదని ఆరోపించారు. సంక్షేమంలో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్‌గా ఉందని తెలిపారు.
BRS Election Campaign in Medak : సాగుకు 24 గంటల కరెంట్ ఇస్తున్న రాష్ట్రం మరొకటి లేదని కేసీఆర్ వివరించారు. ప్రజల డబ్బును రైతుబంధు రూపంలో వృథా చేస్తున్నానని కాంగ్రెస్ నేతలు అంటున్నారని మండిపడ్డారు. రైతుబంధు ఉండాలంటే మళ్లీ బీఆర్ఎస్ గెలవాలని స్పష్టం చేశారు. రైతులకు 24 గంటల కరెంట్ అవసరం లేదని రేవంత్‌రెడ్డి అన్నారని ధ్వజమెత్తారు. రైతులకు 3 గంటల కరెంట్ చాలని రేవంత్‌రెడ్డి(Revanth Reddy) అంటున్నారని విమర్శించారు. కాంగ్రెస్ వస్తే.. ధరణి తీసేస్తామని చెప్తున్నారని ఆరోపించారు. ధరణి ఉండటం వల్లే రైతుబంధు డబ్బులు వస్తున్నాయని పేర్కొన్నారు. ధరణి ఉండటం వల్లే రైతుబీమా, ధాన్యం డబ్బులు వస్తున్నాయన్నారు.
CM KCR Medak Public Meeting :రైతుబంధు పెట్టుబడి కింద ఇస్తున్నామని, రైతుల పండించిన పంటను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని సీఎం కేసీఆర్ హామీనిచ్చారు. కాంగ్రెస్ రైతుబంధు దుబారా అంటుంది నిజమా..? అని ప్రజలను సీఎం అడిగారు. రైతుబంధు ఉండాలి అంటే పద్మ దేవేందర్ రెడ్డి గెలవాలని కోరారు. పద్మాని గెలిపిస్తే రైతుబంధు 16,000 అవుతుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పెద్దలు అధికారంలోకొస్తే ధరణి తీసి బంగాళాఖాతంలో వేస్తామంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుబంధు వేస్తే డైరెక్ట్‌గా రైతుల ఖాతాల్లోనే పడుతున్నాయన్నారు. ధరణిని బంగాళాఖాతంలో వేస్తే రైతులకు డబ్బులు ఎలా వస్తాయని ప్రశ్నించారు.