తెలంగాణ

telangana

ETV Bharat / state

రామాయంపేటలో ఉద్రిక్తత... మృతదేహాల తరలింపు సమయంలో ఘర్షణ

మెదక్‌ జిల్లా రామాయంపేటలో ఉద్రిక్తత నెలకొంది. కామారెడ్డిలో ఆత్మహత్యకు పాల్పడ్డ సంతోష్, అతని తల్లి పద్మ మృతదేహాలను మెదక్‌ జిల్లా రామాయంపేటకు తరలిస్తుండగా ఘర్షణ చోటుచేసుకుంది. మృతదేహాలను మున్సిపల్‌ ఛైర్మన్ ఇంటికి తీసుకెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఉద్రిక్తత నెలకొంది.

ramayanpet
ramayanpet

By

Published : Apr 16, 2022, 5:22 PM IST

Updated : Apr 16, 2022, 7:06 PM IST

కామారెడ్డిలో ఆత్మహత్యకు పాల్పడ్డ సంతోష్, అతడి తల్లి పద్మ మృతదేహాలను మెదక్‌ జిల్లా రామాయంపేటకు తరలించారు. మృతదేహాల తరలింపు సమయంలో ఘర్షణ చోటు చేసుకుంది. సంతోష్‌, పద్మ మృతికి రామాయంపేట మున్సిపల్‌ ఛైర్మన్‌ జితేందర్‌గౌడ్‌ కారణమంటూ విపక్షాలు ఆందోళనకు యత్నించాయి. మృతదేహాలను మున్సిపల్‌ ఛైర్మన్ ఇంటికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. మున్సిపల్‌ ఛైర్మన్ జితేందర్‌గౌడ్‌ ఇంటికి తీసుకెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు.

రామాయంపేటలో ఉద్రిక్తత... మృతదేహాల తరలింపు సమయంలో ఘర్షణ

మృతదేహాలను శ్మశానికి తీసుకెళ్లాలని పోలీసులు సూచించారు. ఈక్రమంలో రామాయంపేటలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిందితులపై కేసు నమోదు చేసి విచారణ చేస్తామని జిల్లా ఎస్పీ రోహిణి హామీతో... మున్సిపల్‌ ఛైర్మన్‌ ఇంటిముందు ఆందోళన విరమించారు. డీఎస్పీ స్థాయి అధికారితో విచారణ జరిపిస్తానని చెప్పారు. మృతదేహాలను అంత్యక్రియల కోసం కుటుంబ సభ్యులు తరలించారు.

ఏం జరిగిందంటే...:మెదక్‌ జిల్లా రామాయంపేట పట్టణానికి చెందిన సంతోష్‌, అతని తల్లి పద్మ... కామారెడ్డిలోని ఓ లాడ్జిలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. గదిలోంచి పొగలు రావడంతో గుర్తించిన అక్కడి సిబ్బంది... పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి చూడగా మొత్తం కాలిపోయిన రెండు మృతదేహాలను గుర్తించారు. నమ్మిన స్నేహితులే తనను మోసం చేశారని.. సంతోష్‌ ఆత్మహత్య లేఖలో పేర్కొన్నారు. రామాయంపేట మున్సిపల్‌ ఛైర్మన్‌ జితేందర్‌గౌడ్‌, అతడి అనుచరులు, పోలీసుల వేధింపుల వల్లే తాము ఆత్మహత్యకు పాల్పడుతున్నామని సంతోష్‌, ఆయన తల్లి పద్మ సెల్పీ వీడియోలో తెలిపారు.

తనకు, కుటుంబ సభ్యులకు మనశాంతి లేకుండా చేశారని సంతోష్‌ కన్నీరుమున్నీరయ్యారు. వ్యక్తిగత విషయాలను అడ్డం పెట్టుకుని ఇబ్బంది పెట్టారని వాపోయాడు. తన స్నేహితుడు బాసం శ్రీనుకు ఈ విషయాలన్నీ తెలుసన్నారు. శ్రీను ద్వారా జితేందర్ గౌడ్... తన విషయాలన్నీ తెలుసుకుని ఇబ్బందులు తీవ్రం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. జితేందర్‌గౌడ్‌ ఇబ్బందులతో నిద్ర లేకుండా పోయిందన్నారు. మానసికంగా కుంగి పోయేలా చేసినట్లు ఆత్మహత్య లేఖలో పేర్కొన్నారు. తనతో సాయం పొందిన వారే మోసం చేశారని... నమ్మిన స్నేహితుడు దగా చేయడం కలిచి వేసిందన్నారు. అందుకే చనిపోతున్నట్లు చెప్పారు.

సంబంధిత కథనం:నిప్పంటించుకుని తల్లీకుమారుడు ఆత్మహత్య.. ఈ వీడియో చూస్తే కన్నీళ్లు ఆగవు..

Last Updated : Apr 16, 2022, 7:06 PM IST

ABOUT THE AUTHOR

...view details