తెలంగాణ

telangana

ETV Bharat / state

మోదీ సారథ్యంలో వ్యవసాయం పండగే: కిషన్​రెడ్డి - డా. రామానాయుడు ఏకలవ్య ఫౌండేషన్ కృషి విజ్ఞాన కేంద్రం

దేశం పారిశ్రామికంగా, వాణిజ్యపరంగా ఎంత ఎదిగినా.. వ్యవసాయమే మూలాధారమని కేంద్ర మంత్రి కిషన్ ​రెడ్డి స్పష్టం చేశారు. మెదక్ జిల్లా తునికిలోని డా. రామానాయుడు ఏకలవ్య ఫౌండేషన్ కృషి విజ్ఞాన కేంద్రం పరిపాలన భవనాన్ని, సేంద్రీయ ఎరువుల కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. కృషి విజ్ఞాన కేంద్రాల సాయంతో రైతులు సేంద్రీయ సాగువైపు మళ్లాలని సూచించారు.

central minister kishan reddy, dr. ramanaidu ekalavya krishi vignan centre
కిషన్​ రెడ్డి, డా. రామానాయుడు ఏకలవ్య ఫౌండేషన్ కృషి విజ్ఞాన కేంద్రం

By

Published : Jan 23, 2021, 7:41 PM IST

వ్యవసాయ ఆధారితమైన భారతదేశానికి విదేశాల నుంచి పండ్లు దిగుమతి చేసుకోవటం.. ప్రశ్నించుకోవాల్సిన అంశమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్​ రెడ్డి పేర్కొన్నారు. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం తునికిలోని డా. రామానాయుడు ఏకలవ్య ఫౌండేషన్ కృషి విజ్ఞాన కేంద్రం పరిపాలన భవనాన్ని, సేంద్రీయ ఎరువుల కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.

దేశం పారిశ్రామికంగా, వాణిజ్యపరంగా ఎంత ఎదిగినా.. వ్యవసాయమే మూలాధారమని కిషన్ ​రెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటికీ 60శాతం మంది దీనిపైనే ఆధారపడ్డారని అన్నారు. గత 70 ఏళ్లుగా వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేశామని పేర్కొన్నారు. వ్యవసాయంలో అధిక లాభాలు అందేలా కృషి విజ్ఞాన కేంద్రాలు.. ఆధునిక పద్ధతులు, సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు అందిస్తున్నాయని కొనియాడారు. సేంద్రీయ విధానంలో పంటలు సాగు చేస్తే ఆరోగ్యంతో పాటు ఆర్థికంగా ప్రయోజనం ఉంటుందని తెలిపారు. కృషి విజ్ఞాన కేంద్రాల సాయంతో రైతులు సేంద్రీయ సాగువైపు మళ్లాలని సూచించారు.

విద్యుత్ కొరతలు లేవు

ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో.. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తోందని కిషన్ రెడ్డి తెలిపారు. గతంలో విపరీతమైన విద్యుత్ కొరత ఉండేదని.. పరిశ్రమలకు, వ్యవసాయానికి కోతలు ఉండేవని గుర్తు చేశారు. అధిక ధరలకు విద్యుత్ కోనుగోలు చేయాల్సిన పరిస్థితులు ఉండేవన్నారు. ప్రస్తుతం దేశంలో ప్రజల అవసరాలకు కావాల్సినంత విద్యుత్ ఉత్పత్తి అవుతోందని తెలిపారు. నేషనల్ పవర్ గ్రిడ్ ఏర్పాటు చేసి దేశంలో ఎక్కడ విద్యుత్ అవసరం ఉంటే అక్కడ పంపిణీ చేస్తున్నామని అన్నారు. గత ప్రభుత్వాల హయాంలో వ్యవసాయం రంగానికి రూ. 30 నుంచి 40వేల కోట్లు మాత్రమే బడ్జెట్​ ఉండేదని.. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత రూ. లక్షా 50 వేల కోట్లకు చేరిందని తెలిపారు. రైతు ఆదాయం రెట్టింపు చేసేలా ప్రయత్నం చేస్తున్నామని వివరించారు. కనీస మద్దతు ధరలు పెంచామని.. అన్నదాతలు తమ ఉత్పత్తులు తమకు ఇష్టమున్న చోట అమ్ముకునే అవకాశం కల్పించామని వెల్లడించారు. రానున్న రోజుల్లో వ్యవసాయ రంగంలో మరిన్ని సంస్కరణలు తీసుకొస్తామని స్పష్టం చేశారు.

మోదీ హయాంలోనే వ్యవసాయానికి పెద్దపీట: కిషన్​ రెడ్డి

పడిగాపులు లేవు

గతంలో ఎరువుల కోసం దుకాణాల ముందు పడిగాపులు పడాల్సిన దుస్థితి రైతులకు ఉండేదని గుర్తు చేశారు. తాము అధికారంలోకి వచ్చాక ఎరువులు పక్కదారి పట్టడాన్ని అరికట్టి.. రైతులకు ఇబ్బంది లేకుండా అందుబాటులోకి తెచ్చామని కిషన్​ అన్నారు. మూత పడిన రామగుండం ఎరువుల కర్మాగారాన్ని రూ. ఆరు వేల కోట్లతో పునరుద్ధరించామని, రెండు నెలల్లో కర్మాగారాన్ని ప్రధాని మోదీ ప్రారంభిస్తారని తెలిపారు. కిసాన్ పేరుతో యూరియాను అందుబాటులోకి తెస్తామన్నారు. డా. రామానాయుడు ఏకలవ్య ఫౌండేషన్.. సేవాభావం, సామాజిక స్పృహతో కృషి విజ్ఞాన కేంద్రాన్ని నిర్వహిస్తోందని అభినందించారు. విజ్ఞాన కేంద్రంలోని వ్యవసాయ క్షేత్రంలో పర్యటించి.. పలు పంటలను, వారు అవలంభిస్తున్న విధానాలను కిషన్​ రెడ్డి పరిశీలించారు.

ఇదీ చదవండి:వేరుశనగ రైతుల్లో ఆనందం.. ఆవేదన!

ABOUT THE AUTHOR

...view details