మెదక్ జిల్లాలో మొత్తం 319 పరిశ్రమలు ఉన్నాయి. మనోహరాబాద్, చేగుంట, చిన్నశంకరంపేట, తూప్రాన్, శివ్వంపేట మండలాల్లో ఫార్మా, స్టీల్, ఆటోమొబైల్‌విడిభాగాలు, రసాయనాలు, కాగితం, పరుపులు, వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు ఉన్నాయి. వాటిల్లో సుమారు 22,100 మంది కార్మికులు పని చేస్తుండే వారు. లాక్‌డౌన్‌కారణంగా పరిశ్రమలు మూతపడ్డాయి. ఈనెల మొదటి వారం నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు షరతులతో కూడిన అనుమతులు ఇవ్వడంతో పలు పరిశ్రమలు తెరుచుకున్నాయి. ఆయా పరిశ్రమల్లో కార్మికులు వారి స్వస్థలాలకు వెళ్లడం వల్ల కొన్ని మాత్రమే నడుస్తున్నాయి. ఈక్రమంలో కేంద్ర సర్కారు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది. రుణాలు తీసుకున్న పరిశ్రమలు తక్షణం ఉత్పత్తి ప్రారంభించినా తిరిగి గాడిలో పడడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది.
జిల్లాలో వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు, ఫార్మా, రసాయన, కాగితం, ఇటుకబట్టీల పరిశ్రమలు రుణాల ద్వారా అధిక ప్రయోజనం పొందనున్నాయి. దీంతో కార్మికులకు ఉపాధి భరోసా లభిస్తుందని విశ్లేషకులు అంటున్నారు. ఇదిలా ఉండగా 22 వేల మంది కార్మికులకు ఈపీఎఫ్‌చెల్లింపులు 12 నుంచి 10 శాతానికి తగ్గించారు. దీనివల్ల కార్మికులు మరింత ఎక్కువ వేతనం పొందుతారు.
అన్నదాతలకు వెన్నుదన్ను...
కర్షకులను అన్ని విధాలా ఆదుకుంటామని కేంద్రం ప్రకటించింది. రాబోయే వానకాలం సీజన్‌లో జిల్లాలో 2.16 లక్షల మందికి రూ.190 కోట్లు రుణాలు ఇవ్వాలని గతంలోనే నిర్ణయించారు. కిసాన్‌క్రెడిట్‌కార్డుల ద్వారా రైతులకు అదనంగా రుణాలు ఇస్తామని ప్రకటించింది. దీంతో జిల్లాలో సక్రమంగా రుణాలు చెల్లించే అన్నదాతలకు అదనంగా రుణం దక్కనుందని అంచనా. సహకార శాఖ ద్వారా జిల్లాలో వానకాలం సీజన్‌లో సుమారు 15 వేల మందికి రూ.50 కోట్లు ఇవ్వాలని గతంలో నిర్ణయించారు.