స్వయం సహాయక సంఘాల సభ్యులు స్వయం ఉపాధి పొందేందుకు వ్యాపారాలు ప్రారంభించగా, దుకాణాలు మూతపడటంతో ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నారు. మాస్క్‌ల తయారీతో కొంత ఊరట లభించినా.. అధికశాతం మంది దీనికి దూరంగానే ఉంటున్నారు. ఈ తరుణంలో ప్రభుత్వం వారికి రుణాలు ఇవ్వాలని నిర్ణయించింది. నిరంతరం ఇచ్చే సాధారణ బ్యాంకు లింకేజీతో పాటు కొవిడ్-19 రుణాలను సైతం ఇస్తున్నారు. మెదక్ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో సెర్ప్ ఆధ్వర్యంలో ఇప్పటికే దీనికి అంకురార్పణ జరిగింది. ఇక పట్టణ ప్రాంతాల్లో మెప్మా ఆధ్వర్యంలో సోమవారం నుంచి ప్రారంభం కానుందని అధికారులు వెల్లడించారు.
రూ.5 వేల చొప్పున..
జిల్లాలోని 20 మండలాల్లో 518 గ్రామైక్య సంఘాలు, 12,413 స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. వీటిల్లో 1,29,983 మంది సభ్యులు ఉన్నారు. మొత్తం నాలుగు పురపాలికలు ఉండగా.. 1,559 స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. ప్రస్తుత ఆపత్కాల పరిస్థితుల్లో సంఘాల్లోని మహిళలకు రూ.5 వేల చొప్పున ప్రత్యేకంగా రుణం ఇవ్వాలని కేంద్రం ఏప్రిల్‌లో ఆదేశాలు జారీ చేసింది.
ఒక స్వయం సహాయక సంఘానికి గరిష్ఠంగా రూ.లక్ష రుణం ఇవ్వొచ్చని వెల్లడించింది. స్వయం సహాయక సంఘం నాయకురాలు బ్యాంకుకు వెళ్లి పత్రాలు పూరిస్తే చాలు ఒక రోజు వ్యవధిలోనే రుణం మంజూరు చేస్తున్నారు. కొవిడ్-19 ఎస్‌హెచ్‌జీ టాప్‌అప్ రుణంగా పిలుస్తున్నారు. రుణం తీసుకున్నాక ఆరు నెలల వరకు కిస్తీలు చెల్లించాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత 30 నెలల్లోగా సులభ వాయిదా పద్ధతిలో నగదు చెల్లించాలి. నిర్దేశిత వ్యవధిలో చెల్లిస్తే శూన్య వడ్డీ వర్తింపజేస్తారని అధికారులు వెల్లడించారు.