తన కుమారుడు కులాంతర వివాహం చేసుకున్నందుకు తమ కుటుంబాన్ని కుల బహిష్కరణ చేశారని ఓ వ్యక్తి ఆరోపించటంతో అధికారులు విచారణ చేపట్టి పరిస్థితిని చక్కదిద్దారు. మెదక్ జిల్లా నిజాంపేట మండలం రజాక్పల్లి గ్రామానికి చెందిన చిందం రాములు గత 30 ఏళ్ల క్రితం ముదిరాజ్ కులానికి చెందిన అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.
ఇటీవల ఇతని కుమారుడు వేణు కూడా ఇతని మేనమామ ముదిరాజ్ కులస్థుడైన శంకరయ్య కూతురు మమతను ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. ఆగ్రహించిన ముదిరాజ్ కులస్థులు తమ కుటుంబాన్ని కుల బహిష్కరణ చేశారని రాములు ఆరోపించాడు.
"మమ్మల్ని కుర్మ కులంలో ఉండవద్దని.. ముదిరాజ్ కులంలో కలవాలని కుల సంఘం పెద్ద మనుషులు ఆదేశించారు. పెళ్లి పెట్టుకుని వంటలు కూడా తయారు చేసిన తరువాత ముదిరాజ్ కులస్థులు ఎవ్వరు నా కొడకు పెళ్ళికి వెళ్లొద్దంటూ హెచ్చరించారు. మా చావు బతుకులకు, పెళ్లిళ్లకు ఎలాంటి సహాయ సహకారాలు కుర్మ కులస్థులు చేయవద్దన్నారు. మాతో మాట్లాడితే జరిమానా విధిస్తామంటూ పెద్ద మనుషులు తీర్పులు చెబుతున్నారు".