కేంద్ర బడ్జెట్‌పై మెదక్ జిల్లా ప్రజల కోటి ఆశలు.. - telangana news 2021
దేశానికి ప్రధానిని అందించిన లోక్‌సభ నియోజకవర్గం అది. ఏళ్ల తరబడి మౌలిక వసతుల కల్పనలో తీవ్ర జాప్యం జరుగుతోంది. నియోజకవర్గ కేంద్రం అయినా నేటికీ రైలు కూత వినిపించడం లేదు. నిధులు మంజూరైనా పనులు పూర్తి చేయడంలో ఆలస్యమవుతోంది. నేడు లోక్‌సభలో నిర్మలమ్మ ప్రవేశపెట్టే బడ్జెట్‌లో.. ఈ సారైనా తమ ప్రాంతానికి నిధులొస్తాయేమోనని కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారు మెదక్ జిల్లా ప్రజలు...
కేంద్ర బడ్జెట్‌పై మెదక్ జిల్లా ప్రజల కోటి ఆశలు..
By
Published : Feb 1, 2021, 7:27 AM IST
మెదక్ జిల్లాలో జాతీయ రహదారుల విస్తరణ, కేంద్రీయ, నవోదయ విద్యాలయాల ఏర్పాటు, పరిశ్రమలు, రైల్వే ప్రాజెక్టుల విషయంలో ముందడుగు పడడం లేదు. ప్రమాదాలను నివారించేందుకు నిర్మించాల్సిన ఉపరితల వంతెనల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపినా నిధులు మంజూరు కావడం లేదు. ఈ నేపథ్యంలో సోమవారం లోక్‌సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టే బడ్జెట్‌పై అంచనాలు నెలకొన్నాయి. మరో వైపు ప్రాతినిథ్యం వహిస్తున్న ఎంపీ గళం విప్పి హామీలు నెరవేర్చాలని జిల్లా వాసులు కోరుకుంటున్నారు.
ప్రతిపాదనలు ఇలా.. అమలు ఎలా..
*పటాన్‌చెరు నుంచి సంగారెడ్డి, జోగిపేట మీదుగా మెదక్ వరకు 89.10 కి.మీల మేర రైల్వే లైన్ నిర్మించాలని ప్రతిపాదన ఉంది. ఇందుకు రూ.1,764.92 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. జిల్లాలో కొల్చారం మండలం దుంపలకుంట, చిన్నఘనపూర్, మెదక్ మండలం మాచవరంలో రైల్వేస్టేషన్లు నిర్మించాలని నిర్ణయించారు. సర్వే పూర్తిచేయగా ఈ బడ్జెట్‌లో రైల్వేలైన్ మంజూరుపై సంగారెడ్డి, మెదక్ జిల్లా వాసులు ఆశలు పెట్టుకున్నారు.
*చేగుంట-మెదక్ మార్గంలో 228 లెవల్ క్రాసింగ్ వద్ద నిత్యం రైళ్ల రాకపోకల సమయంలో గేటు పడినప్పుడు ట్రాఫిక్ సమస్య ఉత్పన్నమవుతోంది. ఇరు వైపులా వాహనాలు భారీగా నిలిచిపోతున్నాయి. జిల్లా కేంద్రం మెదక్ వెళ్లేందుకు ఉన్న మార్గం కావడంతో వాహనాల రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. రైల్వే గేటు పడినప్పుడు ఎక్కువ సమయం వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇక్కడ సైతం వంతెన నిర్మించాల్సి ఉంది.
*మెతుకుసీమలో ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాల మినహా పెద్దగా విద్యాసంస్థలు లేవు. మెదక్ జిల్లాలో సీబీఎస్‌ఈ సిలబస్ కలిగిన ఒక్క పాఠశాల లేదు. జిల్లాలో నవోదయ, కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కేంద్రీయ విద్యాలయంలో ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు విద్యాబోధన ఉంటుంది. నవోదయలో ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకు తరగతులు కొనసాగుతాయి. ఈ రెండింటిలో కనీసం ఒకటైనా జిల్లాకు మంజూరైతే విద్యార్థులకు ప్రయోజనకరంగా ఉంటుంది.
*44వ జాతీయ రహదారి జిల్లాలో 55 కి.మీల మేర విస్తరించి ఉంది. చేగుంట బైపాస్ సర్కిల్, రెడ్డిపల్లి, నార్సింగి, జప్తిశివనూర్, రామాయంపేట అడిగాస్ హోటల్ వద్ద నిత్యం ప్రమాదాలు చోటు చేసుకుంటుండగా, ఏటా పదుల సంఖ్యలో మృత్యువాత పడుతున్నారు. తూప్రాన్ మండలం నాగులపల్లి వద్ద ఇది వరకు ప్రమాదాలు అధిక సంఖ్యలో జరిగేవి. ప్రస్తుతం అక్కడా రూ.32.25 కోట్లతో ఉపరితల వంతెన నిర్మిస్తున్నారు. ఇలాంటి వంతెనలు జాతీయ రహదారిపై ఐదు చోట్ల నిర్మించాల్సి ఉంది. ఇందుకు ప్రతిపాదనలు కేంద్రానికి పంపారు. ఈ బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తే కొంత వరకైనా వాహనదారుల ప్రాణాలు దక్కనున్నాయి.
*హైదరాబాద్ సమీపంలోని గండి మైసమ్మ నుంచి నిర్మల్ జిల్లాలోని బైంసా వరకు 238 కి.మీల మేర 765 (డి) జాతీయ రహదారి మంజూరైంది. ఇందుకు రూ.322 కోట్లు కేటాయించారు. గండిమైసమ్మ నుంచి మెదక్ పట్టణ శివారు వరకు 62 కి.మీ మేర పనులు చేపట్టారు. హవేలి ఘనపూర్ మండల కేంద్రం నుంచి కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి, బాన్సువాడ, నిజామాబాద్ జిల్లాలోని బోధన్, నిర్మల్ జిల్లాలోని బైంసా వరకు విస్తరణ చేపట్టాల్సి ఉంది. ఇందుకు కేంద్రం నిధులు ఇస్తే రెండో విడతలో పనులు చేపట్టేందుకు అవకాశం ఉంటుంది. జిల్లాలో నర్సాపూర్ మండలం కొండాపూర్ నుంచి మెదక్ వరకు 43 కి.మీల జాతీయ రహదారి కొనసాగుతోంది. గండి మైసమ్మ నుంచి మెదక్ వరకు నిర్మించిన జాతీయ రహదారిపై విభాగిని లేక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రస్తుతం మండల కేంద్రాలతో పాటు ప్రధాన గ్రామాల్లోనే విభాగినిని నిర్మించారు. మిగిలిన ప్రాంతాల్లో విభాగిని నిర్మిస్తే ప్రమాదాలకు కళ్లెం పడనుంది. విభాగిని నిర్మాణానికి నిధుల మంజూరుకు కృషిచేస్తానని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి గతంలో హామీ ఇచ్చారు.
నిధులు మంజూరు కావాల్సి ఉంది..
కేంద్రీయ, నవోదయ, సైనిక్ పాఠశాలల ఏర్పాటు, జాతీయ రహదారుల విస్తరణ విషయమై ఇది వరకే ప్రతిపాదనలు పంపాం. కేంద్ర ప్రభుత్వం స్పందించి నిధులు మంజూరు చేయాల్సి ఉంది. నియోజకవర్గంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, నిధుల మంజూరు విషయాన్ని సభలో ప్రస్తావిస్తా. బడ్జెట్‌లో కేంద్రం రాష్ట్రానికి ప్రకటించే వాటిని పరిశీలించి స్పందిస్తాం. హైదరాబాద్ గండిమైసమ్మ నుంచి 765(డి) జాతీయ రహదారిని నియోజకవర్గ పరిధి వరకు పూర్తి చేశాం.