BRS Assembly Elections Campaign 2023 : అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 24 గంటల కరెంటే ప్రధాన ఎజెండాగా ప్రచారం చేస్తోంది. అభ్యర్థులు తమ నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తూ.. భారత్ రాష్ట్ర సమితిని ముచ్చటగా మూడోసారి అధికారంలోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి దానం నాగేందర్ హిమాయత్ నగర్‌లో వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం.. ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ముఖ్యమంత్రి అందిస్తున్న సంక్షేమ పథకాలే తమ పార్టీ గెలుపునకు సోపానాలని పేర్కొన్నారు. మైనార్టీల సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్లవేళలా కట్టుబడి ఉంటుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. సనత్‌నగర్ నియోజకవర్గం పరిధిలోని ముస్లిం మత పెద్దలు, ముఖ్య నేతలతో ఆయన సమావేశమయ్యారు. ముస్లింలంతా ఏకతాటి పైకి వచ్చి.. కేసీఆర్ నాయకత్వాన్ని బలపరిచి భారీ మెజారిటీతో తనను గెలిపించాలని కోరారు.
నల్గొండ జిల్లా నాగార్జునసాగర్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నోముల భగత్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మాడుగులపల్లి మండలంలోని ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి ప్రచారాన్ని మొదలుపెట్టారు. ఈ సందర్భంగా తనపై పోటీ చేయలేక.. జానారెడ్డి తన కుమారుడిని నిలబెట్టడం చాలా హాస్యాస్పదమని విమర్శించారు. మెదక్ నియోజకవర్గంలోని రామాయంపేట మండలం ప్రగతి ధర్మారంలో పెద్దమ్మ తల్లి దేవాలయంలో ప్రత్యేక పూజల అనంతరం ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. నియోజకవర్గంలోని శివాయిపల్లి, సుతార్‌పల్లి, వెంకటాపూర్(ఆర్), రాయిలాపూర్, దామరచెరువు, అక్కన్నపేట, తొనిగండ్ల, ఝాన్సిలింగాపూర్ గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించిన ఆమె.. కాంగ్రెస్‌లో కుర్చీల కొట్లాటకే సమయం సరిపోవట్లేదని మండిపడ్డారు. ఈ ఎన్నికల్లో ప్రజలు మళ్లీ తనను ఆశీర్వదించి గెలిపించాలని ఆమె కోరారు.