భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ పాదయాత్ర మెదక్‌కు చేరింది. తెరాస, భాజపా ఎప్పటికీ ఒక్కటి కావని సంజయ్ తేల్చి చెప్పారు. తెరాస, కాంగ్రెస్, ఎంఐఎం మాత్రమే కలుస్తాయన్నారు. ఎన్నికల ముందు మాత్రమే ఉద్యోగాల గురించి చెబుతారని ఎద్దేవా చేశారు. 3 లక్షల ఇళ్ల కోసం కేంద్రం రూ.10 వేల కోట్లు ఇచ్చిందని తెలిపారు. దేశంలో 135 కోట్ల మందికి ఉచితంగా టీకాలు ఇస్తున్నామన్నారు. తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా జరపాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటనతో ఐదుగురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు. ఈ హత్యలకు సీఎం కారణమని ఆరోపించారు. వరి ఎస్తే ఉరే అని సీఎం కేసీఆర్ అనటంతో ఐదురుగు రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారని చెప్పారు.
భాజపా, తెరాస ఎప్పుడైనా కలిసి పోటీ చేశాయా. కానీ తెరాస, కాంగ్రెస్ కలిసి పోటీ చేశాయి. తెరాస, కమ్యూనిస్టులు కలిసి పోటీ చేశారు. తెదేపా, తెరాస కలిసి పోటీ చేశాయి తప్ప భాజపా, తెరాస ఎప్పుడూ కలిసి పోటీ చేయలేదు. కాంగ్రెస్‌లో గెలిచిన ఎమ్మెల్యేలు తెరాసలోకి పోయారు. కానీ భాజపాలో గెలిచిన ఎమ్మెల్యేలు ఎవరు గులాబీ పార్టీలోకి పోలేదు. భాజపా, తెరాస ఒక్కటి అంటే దుబ్బాకలో రఘునందన్ రావు ఎలా గెలుస్తారు..? జీహెచ్ఎంసీలో ఎలా గెలుస్తాం..? వరంగల్ కార్పొరేషన్లో ఒక్క స్థానం భారతీయ జనతా పార్టీ 12 స్థానాల్లో ఏ విధంగా గెలుస్తాం.? భాజపాను ఏదో విధంగా అప్రదిష్టపాలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రయత్నం చేస్తున్నాయి.