రైతుల క్షేమం కోసం నూతన వ్యవసాయ బిల్లులు ఆమోదించవద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా.. కేంద్రం చట్టాలను చేసిందని ఏఐసీసీ ఇన్ఛార్జ్ బోస్ రాజు ఆరోపించారు. కేవలం 24 గంటల్లో రాష్ట్రపతి ఆమోదంతో దేశంలో జారీ చేసిందని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ మెదక్ జిల్లా అధ్యక్షులు కంటారెడ్డి తిరుపతి రెడ్డి అధ్యక్షతన సోమవారం క్రిస్టల్ గార్డెన్ నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు.
రాష్ట్రపతికి వినతి పత్రం సమర్పించాం
చట్టాలను రద్దు చేయాలని దిల్లీలో 50 రోజులుగా రైతులు ధర్నా చేస్తున్నారని.. ఇప్పటివరకు 60 మంది చనిపోయారని బోస్‌రాజు తెలిపారు. ఎటువంటి పరిశీలన లేకుండా రైతులకు వ్యతిరేకంగా ఈ చట్టాలను తీసుకు రావడం సరికాదన్నారు. గత నెల 23న 'కిసాన్ సెల్' ఆధ్వర్యంలో దేశంలో 2కోట్ల మంది రైతులతో సంతకాల సేకరణ చేసి రాహుల్ గాంధీ నేతృత్వంలో.. వ్యవసాయ బిల్లును వెనక్కి తీసుకోవాలని రాష్ట్రపతికి వినతి పత్రం సమర్పించినట్లు చెప్పారు. వ్యవసాయాన్ని, ఆదాయాన్ని అంబానీలకు అప్పజెప్పే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వంతో రైతు సంఘాలు 7 సార్లు సమావేశమైనా.. చట్టాలను వెనక్కి తీసుకునే ప్రయత్నం చేయలేదని మండిపడ్డారు. చట్టాలను రద్దు చేసే వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.