అవినీతి నిరోధకశాఖ అధికారులకు అతిపెద్ద తిమింగలం చిక్కింది. రూ. కోటి 12 లక్షల అవినీతి వ్యవహారంలో మెదక్ జిల్లా అడిషనల్ కలెక్టర్ గడ్డం నగేశ్ బుధవారం దొరికిపోయారు. 112 ఎకరాల భూమికి సంబంధించిన నిరభ్యంతర పత్రం-ఎన్వోసీ ఇచ్చేందుకు రూ. 40 లక్షలు తీసుకొని ఐదు ఎకరాలను తన బినామీ పేరిట రిజిస్ట్రేషన్ చేయించేలా ఒప్పందం రాయించుకోవడం అనిశా అధికారుల్ని ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ వ్యవహారంలో అడిషనల్ కలెక్టర్ నగేషశ్తో పాటు నర్సాపూర్ ఆర్డీవో బి.అరుణారెడ్డి, చిలప్‌చెడ్ తహసీల్దార్ అబ్దుల్ సత్తార్, జూనియర్ అసిస్టెంట్ వసీం అహ్మద్, బినామీ జీవన్‌గౌడ్‌ను అధికారులు అరెస్టు చేశారు.
హైదరాబాద్ శేరిలింగంపల్లికి చెందిన లింగమూర్తితో పాటు మరో నలుగురు కలిసి మెదక్ జిల్లా నర్సాపూర్ మండలంలోని చిప్పల్‌తుర్తిలో.. 112 ఎకరాలు కొనేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. నిషేధిత జాబితాలోని ఆభూముల రిజిస్ట్రేషన్‌కు వీలుగా ఎన్వోసీ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఎకరాకు లక్ష చొప్పున మొత్తం రూ. కోటి 12 లక్షలు లంచంగా ఇవ్వాలని జిల్లా అడిషనల్ కలెక్టర్ నగేశ్ డిమాండ్ చేయడం వల్ల బాధితుడు లింగమూర్తి ఏసీబీకి ఫిర్యాదు చేశారు. రూ. 40 లక్షలు నగదు తీసుకున్న అదనపు కలెక్టర్.. మరో 72 లక్షల కోసం ఐదు ఎకరాల భూమిని బినామీ అయిన జీవన్‌గౌడ్ పేరు మీద ఒప్పందం చేయించుకున్నాడు. ఆ భూమిని రిజిస్ట్రేషన్ చేసేందుకు గ్యారంటీగా వారి నుంచి 8 ఖాళీ చెక్కులను తీసుకున్నారు. నగేశ్, సూచనల మేరకు బాధితుల నుంచి ఐదు లక్షలు తీసుకున్న జూనియర్ అసిస్టెంట్ వసీం అహ్మద్ అందులో నుంచి ఒక్కో లక్ష చొప్పున ఆర్డీవో అరుణారెడ్డి, చిలప్‌చెడ్ తహసీల్దార్ అబ్దుల్ సత్తార్‌లకు అందించారు. అధికారులు మాట్లాడిన సంభాషణలు సహా ఇతర ఆధారాలు బాధితుడు అనిశా అధికారులకు అందించాడు.
మెదక్ జిల్లా క్యాంపు కార్యాలయం, అడిషనల్ కలెక్టర్ గడ్డం నగేశ్ నివాసం సహా.. ఆర్డీవో అరుణారెడ్డి, చిలప్‌చెడ్ తహసీల్దార్ అబ్దుల్ సత్తార్‌లనూ అనిశా విచారించింది. వారి నగదు, ఖాళీ చెక్కులు, పలు పత్రాలు స్వాధీనం చేసుకుంది. శాసనసభలో ప్రభుత్వం నూతన రెవెన్యూ చట్టం బిల్లును ప్రవేశపెట్టిన రోజే మెదక్ జిల్లాలో ఇలా ఉన్నతాధికారులపై దాడులు జరగడం గమనార్హం.