ఓ వైపు వైకల్యంతో ఉన్న బిడ్డ... మరోవైపు భర్త మరణం ఆమె జీవితాన్ని కష్టాల పాలు చేసింది. ఐదుగురున్న కుటుంబంలో తానే పెద్దదిక్కయింది. మహిళలు అరుదుగా చేసే పని ఎంచుకుంది. కులవృత్తే ఆమె దైవమైంది. కష్టాలు తీరడం కోసం ఆమె ఎంచుకున్న ఈ వృత్తి ఆమెకు ఓ అరుదైన గుర్తింపును తీసుకొచ్చింది. రాష్ట్రంలో కల్లుగీత కార్మికురాలిగా ప్రభుత్వ లైసెన్సు పొందిన ఐదుగురు మహిళల్లో ఒకరిగా నిలిచింది.
ఇదీ సావిత్రి కథ
సావిత్రిది మెదక్ జిల్లా రేగోడ్. సాధారణ కుటుంబం. పదో తరగతి వరకు చదువుకుంది. 2011లో అదే గ్రామానికి చెందిన గీత కార్మికుడు సాయాగౌడ్‌తో పెళ్లయింది. ఇంట్లో వారికితోడు అత్త, మామలున్నారు. రేపటిపై ఆశ తప్ప... పెద్దగా ఆస్తిపాస్తులేవీ లేవు. ఉన్నదాంట్లో కలోగంజో తాగుతూ చీకూచింతాలేకుండా గడిపేస్తున్నారు.
వైకల్యంతో బిడ్డ!
ఇంతలో సావిత్రికి పాప పుట్టింది. ఆమె దివ్యాంగురాలు. మొదట్లో బాధపడ్డా తర్వాత ఆ దంపతులు ఒకరికొకరు ధైర్యం చెప్పుకొన్నారు. బిడ్డను కష్టపడి ప్రయోజకురాలిని చేద్దాం అని నిర్ణయం తీసుకున్నారు. దీనికోసం సాయాగౌడ్ ఇంకా ఎక్కువ ఉత్సాహంగా కష్టపడేవాడు. ఇంతలో దేవుడు ఆ కుటుంబానికి కోలుకోలేని కష్టాన్నిచ్చాడు.
చితికిన బతుకు
2016లో ఓ రోజు... అప్పుడు సావిత్రి నాలుగు నెలల గర్భిణీ. సాయంత్రం అలిసిపోయి ఇంటికి వచ్చిన భర్త తొందరగా నిద్రలోకి జారుకున్నాడు. ఇక ఆయన లేవలేదు. గుండెపోటుతో నిద్రలోనే కన్నుమూశాడు. అంతే... ఒక్కసారిగా ఆ పేదకుటుంబం చితికిపోయింది. సావిత్రి అయితే నెల రోజులు మనిషి కాలేకపోయింది. కన్నీరుమున్నీరుగా ఏడ్చింది. కానీ కళ్లముందు బాధ్యతల బరువులు. అటు వృద్ధులైన అత్తమామలు. ఇటు పసిపాప. కడుపులో మరోబిడ్డ. ఆమెను కష్టాలు ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే సావిత్రి తనకు తానే ధైర్యం చెప్పుకుంది. కుటుంబాన్ని పోషించుకోవాలని నిర్ణయించుకుంది.