మెదక్ జిల్లా చిన్న శంకరం పేట మండలం కామారం తండా సమీపంలో బోనుకు చిక్కిన చిరుతను అధికారులు తరలించారు. ప్రత్యేక వాహనంలో నార్సింగి మండలం వల్లూరు ఫారెస్ట్ నర్సరీకి తీసుకెళ్లారు. అక్కడ చిరుతకు ఆహారం, నీరు అందించి... దాని ఆరోగ్య పరిస్థితి సమీక్షించి అనంతరం హైదరాబాద్‌లోని జూ పార్కుకు తరలించనున్నట్లు జిల్లా అటవీ శాఖ అధికారి జ్ఞానేశ్వర్ తెలిపారు. చిరుతపులి వయస్సు సుమారు ఏడాది ఉండొచ్చన్నారు. కొన్ని రోజులుగా చిరుతపులి సంచారం ప్రజలను భయాందోళనకు గురిచేసింది.
పోలీసులు, అటవీశాఖ అధికారులు సంయుక్తంగా చర్యలు చేపట్టారని మెదక్ ఎస్పీ చందనాదీప్తి వెల్లడించారు. స్థానికులు అనవసరంగా అడవుల్లోకి వెళ్లవద్దని... వన్యప్రాణుల సహజ ఆవాసాలకు భంగం కలిగించవద్దని అధికారులు సూచించారు. వన్యప్రాణులు తమకు తాము అడవులను వదిలి బయటకు రావని... మనమే అవి బయటకు వచ్చేలా ప్రవర్తిస్తామని అన్నారు.
గతరాత్రి కామారం తండాలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అరేంజ్ చేసినటువంటి కేజ్‌లో ఏడాది వయసున్న చిరుత ట్రాప్ కావడం జరిగింది. గత ఆరు నెలల నుంచి ఈ గ్రామ శివారులో ఈ చిరుత వల్ల కొద్దిగా ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారని చెప్పి... ఫారెస్ట్ బయటకు రాకుండా... అటవీ బయట ఈ కేజ్‌ను ఏర్పాటు చేశాం. సాధారణంగా ఈ చిరుత ఎప్పుడూ బయటకు రాలేదు. ఫారెస్ట్ లోపలే ఉంటుంది. ఇక్కడే దాని నివాస ప్రాంతముంది. ఇక్కడే నెమలిగుట్ట దగ్గర. ఇది చాలా సేఫ్‌గా ఉంది. హెల్దీగా ఉంది. పూర్తిగా సహజమైనటువంటి అడవుల్లో తిరుగుతూ పెరిగన చిరుత. ఎట్టి పరిస్థితుల్లోనూ ఫారెస్ట్‌లోకి అనవసరంగా ఎంటర్ కావొద్దు. దాని సహజమైనటువంటి ఆవాసాలను డిస్ట్రబ్ చేయకూడదు.