ఏడో ఎనిమిదో కాదు.. ఏకంగా 130 రకాల వరి వంగడాలను ఒకేచోట సాగుచేస్తూ వినూత్న పంథాలో విజయవంతంగా సాగుతున్నారు ముగ్గురు అన్నదమ్ములు.. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నార్సింగికి చెందిన వీరంతా ప్రకృతి వ్యవసాయం(Natural Farming)తో లాభాల పంట పండిస్తున్నారు. నార్సింగికి చెందిన జిన్న బేతయ్య, నింగమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు బాలు, రాజు, కృష్ణ. వీరిది వ్యవసాయ కుటుంబం. పెద్దబ్బాయి బాలు హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. ప్రకృతి సాగుతో ఆరోగ్యకర సమాజ నిర్మాణానికి బాటలు వేయాలన్న ఆలోచన ఆయనది. దాన్ని తమ్ముళ్లతో పంచుకోగా వారూ సై అన్నారు. చిన్నవాడు కృష్ణ 2015లో కరీంనగర్‌లో ప్రకృతి వ్యవసాయ నిపుణులు డా.సుభాష్ పాలేకర్ చెంత గోఆధారిత ప్రకృతి సాగుపై మెలకువలు నేర్చుకున్నారు. ఆ క్రమంలో అదే ఏడాది తమకున్న 17 ఎకరాలలో ప్రకృతి వ్యవసాయానికి శ్రీకారం చుట్టారు. 14 ఎకరాలలో వరి, 3 ఎకరాల్లో కంది పండిస్తున్నారు.
గ్రామభారతి సహకారంతో..
స్వయం సమృధ్ధి కలిగిన గ్రామాల కోసం గ్రామభారతి స్వచ్ఛంద సేవాసంస్థ సహకారం తీసుకుంటున్నామని వారు తెలిపారు. సంప్రదాయ విత్తన సంరక్షణ, ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాం. భూ, వన, జలసంపదలు కలుషితం కాకుండా చూడాలన్నది మా ఉద్దేశమని పేర్కొన్నారు. జీవన విధానంలో మార్పు తెచ్చి ఆరోగ్యకరమైన సమాజం నిర్మించేందుకు మా వంతుగా ప్రయత్నిస్తున్నామని తెలిపారు.