Sharmila fires on CM KCR: ప్రజా ప్రస్థానం పాదయాత్రలో వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల మరోసారి సీఎం కేసీఆర్పై విమర్శనాస్త్రాలు సంధించారు. తెలంగాణ ఉద్యమంలో సింగరేణి కార్మికులే కీలకమని మాటలు చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్.. నేడు సింగరేణి అభివృద్ధిని విస్మరించారని షర్మిల ఆరోపించారు. ప్రజా ప్రస్థానం పేరుతో చేపట్టిన పాదయాత్ర 201వ రోజు మంచిర్యాల జిల్లా మందమర్రి మండలంలో కొనసాగింది.
మండలంలోని బొక్కలగుట్ట నుంచి ప్రారంభమైన పాదయాత్ర పులిమడుగు, అందుగులపేట గ్రామాల మీదుగా మందమర్రి వరకు చేరింది. షర్మిలకు స్థానిక యువ నాయకులు ఘన స్వాగతం పలికారు. స్థానిక ప్రజా సమస్యలను షర్మిల అడిగి తెలుసుకున్నారు. లక్షా 60వేలుగా ఉన్న సింగరేణి ఉద్యోగులను 40 వేలకు కుదించారని ప్రభుత్వంపై షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గడిచిన తొమ్మిదేళ్ల పాలనలో సింగరేణికి చేసిందేమి లేదని మండిపడ్డారు. అధికారంలోకి వస్తే కొత్తగా భూగర్భ గనులను ఏర్పాటు చేస్తానని మాయమాటలు చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్... నేడు సింగరేణి ప్రాంతాన్ని బొందల గడ్డగా మారుస్తున్నారని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు.