ఉద్యోగాల నియామాకాలు కోసం వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల చేపట్టిన దీక్ష ముగిసింది. ప్రతి మంగళవారం చేపడుతున్న దీక్షల్లో భాగంగా.. మంచిర్యాల జిల్లా దండేపల్లి ఆమె నిరుద్యోగ నిరాహార దీక్ష చేపట్టారు. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి కుటుంబం పరామర్శకు వెళ్లాల్సి ఉన్నా.. వారు నిరాకరించటంతో దండేపల్లిలో దీక్షా కార్యక్రమాన్ని చేపట్టారు. ఉద్యోగాల భర్తీ పట్ల రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును షర్మిల తప్పుబట్టారు. నిరుద్యోగుల ఆత్మహత్యలపై స్పందించని సీఎం కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ప్రజల గురించి ఆలోచన చేయని ముఖ్యమంత్రి.. ఇంతమంది చిన్న బిడ్డలు చనిపోతున్నా స్పందించని ముఖ్యమంత్రి అవసరమే లేదు. అఫ్గానిస్థాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకున్నారని.. ఐరాస ఏం చేస్తుందని కేటీఆర్ ప్రశ్నించారు. అయ్యా... చిన్న దొర మన రాష్ట్రంలోనే వందల మంది ఆత్మహత్యలు చేసుకుంటే ఎందుకు స్పందించడం లేదు. మీరేమైనా మౌనవ్రతం చేస్తున్నారా? తండ్రిని ప్రశ్నిస్తే మంత్రి పదవి ఎక్కడ పోతుందో అని భయపడుతున్నారా? ఈరోజు తాలిబన్ చేతిలో అఫ్గానిస్థాన్ ఎలా బందీ అయిందో... కల్వకుంట్ల కుటుంబం చేతిలో ఏడేళ్లలో తెలంగాణ బందీ అయింది. ఇదీ వాస్తవం.