తెలంగాణ

telangana

ETV Bharat / state

Singareni Trade unions strike: సింగరేణిలో మోగనున్న సమ్మె సైరన్ ...

Singareni strike: సింగరేణిలో సమ్మె సైరన్ మోగనుంది. బొగ్గు బ్లాకులను ప్రైవేటుకు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ... ఈనెల 9, 10, 11 తేదీల్లో సమ్మె చేసేందుకు కార్మిక సంఘాలు సిద్ధమయ్యాయి. ఇప్పటికే సింగరేణి యాజమాన్యం కార్మిక సంఘాలతో జరిపిన చర్చలు విఫలం కావడంతో సమ్మె అనివార్యమని కార్మిక సంఘాలు స్పష్టం చేస్తున్నాయి.

Singareni Trade unions strike
Singareni Trade unions strike

By

Published : Dec 8, 2021, 5:07 AM IST

Singareni strike: సింగరేణిలో సమ్మె సైరన్ మోగనుంది. ప్రైవేట్ వ్యక్తులకు బొగ్గు గనులు అప్పగించవద్దంటూ... ఐదు జాతీయ సంఘాలు సమ్మెకు పిలుపునిచ్చాయి. ఈనెల 9, 10, 11 తేదీల్లో సమ్మె చేసేందుకు కార్మిక సంఘాలు నోటీసులిచ్చాయి. ఇప్పటికే సింగరేణి యాజమాన్యం కార్మిక సంఘాలతో చర్చలు జరిపినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. దీంతో సమ్మె అనివార్యమని కార్మిక సంఘాలు స్పష్టం చేస్తున్నాయి.

సీఎం లేఖరాసినప్పటికీ...

ఖమ్మం జిల్లా సత్తుపల్లి, మంచిర్యాల జిల్లా కళ్యాణిఖని, శ్రావణపల్లి, కొత్తగూడెం జిల్లా కోయగూడెం బొగ్గు బ్లాకులను ప్రైవేటుకు అప్పగించడాన్ని కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం తోపాటు... ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, హెచ్​ఎమ్​ఎస్​, సీఐటీయూ, బీఎమ్​ఎస్​ సమ్మెకు పిలుపునిచ్చాయి. ఈనెల 9, 10, 11 తేదీల్లో నిరసన తెలపాలని సింగరేణి సంస్థకు నోటీసులు ఇచ్చాయి. ఆయా సంఘాలతో చర్చలు జరిపిన సింగరేణి యాజమాన్యం సంస్థ తరఫున కేంద్రానికి లేఖ రాయడంతోపాటు ఆ బ్లాక్‌లలో చేపట్టిన అన్వేషణ పనులను వివరించామని కార్మిక సంఘాలకు యాజమాన్యం తెలిపింది. బొగ్గు బ్లాక్‌లను సింగరేణికి కేటాయించాలని కోరుతూ సీఎం కూడా కేంద్రానికి లేఖరాసిన విషయాన్ని సంఘాలకు వివరించింది. బొగ్గు బ్లాక్‌ల కేటాయింపు ఒక్క సింగరేణి, తెలంగాణకు సంబంధించిన అంశం కాదని వివరించింది.

మూడ్రోజుల సమ్మె సరిపోదు...

నాలుగు బొగ్గు బ్లాకులను వేలం వేయాలని మంత్రిత్వశాఖ ప్రతిపాదనలు చేయడం... అవి టెండర్‌ స్థాయికి రావడం కార్మికుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఈ నాలుగు బ్లాకులతోపాటు... మిగిలిన బ్లాకులన్నీ ప్రైవేటుపరమయ్యే అవకాశముందని కార్మికుల్లో ఆందోళన నెలకొంది. బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు చేస్తున్న మూడ్రోజుల సమ్మె మాత్రమే సరిపోదని టీబీజీకేఎస్​ భావిస్తోంది. ప్రైవేటీకరణ ప్రభావ తీవ్రతను సీఎం దృష్టికి తీసుకెళ్లి... ఈ బ్లాకులను సింగరేణికే అప్పగించే విధంగా ప్రయత్నించాలని యోచిస్తోంది. సమ్మెకు వెళుతూనే కేంద్రంపై ఒత్తిడి తేవాలని టీబీజీకేఎస్ భావిస్తోంది.

ఉత్పత్తిపై సమ్మె ప్రభావం...

సింగరేణిలో బొగ్గు ఉత్పత్తిపై ఇప్పటికే కొవిడ్ ప్రభావం చూపించగా... సమ్మెతో ఆ ప్రభావం మరింత పెరిగే అవకాశముందని యాజమాన్యం భావిస్తోంది. మరోవైపు సమ్మెతో ప్రయోజనం లేకపోయినా... బొగ్గు బ్లాకుల కోసం ఇక్కడికి వచ్చే ప్రైవేటు సంస్థలను అడ్డుకుంటామని కార్మికులు చెబుతున్నారు. అవసరమైతే దిల్లీకి వెళ్లి ఆందోళన చేస్తామని అంటున్నారు.

బొగ్గు బ్లాకులను ప్రైవేటుకు అప్పగించడంవల్ల మా కార్మికుల మనుగడ ప్రశ్నార్థకంగా మారనుంది. అందుకే సమ్మెకు వెళుతూ కేంద్రంపై ఒత్తిడి తేవాలని అనుకుంటున్నాం. సమ్మె చేయడం ద్వారా ప్రభుత్వానికి మా నిరసన తెలిపే ప్రయత్నం చేస్తున్నాం. సమ్మె వల్ల కేంద్ర ప్రభుత్వం వెనక్కు తగ్గుతుందని మేము భావిస్తున్నాం- మిర్యాల రాజిరెడ్డి, టీబీజీకేఎస్‌ ప్రధాన కార్యదర్శి

సింగరేణిలో మోగనున్న సమ్మె సైరన్

ఇదీ చదవండి:mp revanth reddy on trs: 'నేను నిన్నే చెప్పానుకదా.. అదే జరుగుతుందని'

ABOUT THE AUTHOR

...view details