TIGER WANDERING: మంచిర్యాల జిల్లా చెన్నూరు అటవీ సబ్ డివిజన్ పరిధిలోని కోటపల్లి అడవుల్లో కొత్త పులి రాకతో మళ్లీ అలజడి మొదలైంది. పశువులను హతమారుస్తూ హల్‌చల్ చేస్తుండటంతో సమీప గ్రామాల ప్రజల్లో మరోసారి భయం పట్టుకుంది. గత ఏడు సంవత్సరాలుగా మహారాష్ట్రలోని తడోబా అడవుల నుంచి సిర్పూర్ కాగజ్‌నగర్ మీదుగా ఈ ప్రాంతానికి రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ క్రమంలో కోటపల్లి మండలం పిన్నారం అడవుల్లో 2016లో వేటగాళ్ల ఉచ్చుకు చిక్కి ఓ పెద్దపులి మృత్యువాత పడటం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది.
అప్పటి నుంచి పులుల సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించిన అటవీశాఖ వాటికి అనువుగా వాతావరణం కల్పిస్తున్నారు. గతంలో ఈ అడవుల్లో కే4 పులితో పాటు జే1, ఎస్8 నామకరణంతో కూడిన ఇతరత్రా పులులను వాటి అడుగుజాడల ఆధారంగా అధికారులు నిర్ధారించారు. ప్రస్తుతం వాటి కదలికలు అంతగా లేకపోవడంతో వివిధ ప్రాంతాలకు తరలి పోయాయని భావిస్తున్న తరుణంలో.. గత 20 రోజుల నుంచి తూర్పు ప్రాంతంలో సంచరిస్తున్న ఓ పులితో మరోసారి అలజడి రేకెత్తింది.
మహారాష్ట్ర నుంచి ప్రాణహిత మీదుగా తెలంగాణలోని మంచిర్యాల జిల్లా కోటపల్లి, నీల్వాయి రేంజ్ పరిధిలోని వెంచపల్లి అడవుల్లోకి సదరు పులి ప్రవేశించింది. బొప్పారం సమీపంలోని అడవుల్లో మేతకు వచ్చిన ఓ మేకపై దాడిచేయడంతో కొత్త పులి కదలికలు వెలుగులోకి వచ్చాయి. అనంతరం నాలుగు రోజులకే ఎడగట్ట అడవుల్లో ఎద్దును హతమార్చడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. తాజాగా ఎదుల్లబంధం గ్రామానికి చెందిన ఎదుల సతీష్, లచ్చయ్య అనే వ్యక్తులకు చెందిన ఆవు, దూడను హతమార్చడంతో కొత్త పులి ఇదే ప్రాంతంలో సంచరిస్తున్నట్లు తెలుస్తోంది.