కవ్వాల్ పెద్దపులుల అభయారణ్యం నుంచి గ్రామాల తరలింపునకు రంగం సిద్ధమవుతోంది. మంచిర్యాల జిల్లా కడెం మండలంలోని మైసంపేట, రాంపూర్ గ్రామాలను తరలించే అటవీ ప్రాంతాల్ని డీనోటిఫై చేయనున్నారు. కేంద్ర పర్యావరణ, అటవీశాఖ సలహా మండలి గతేడాదే దీనికి ఆమోదం తెలిపింది. నేడు హైదరాబాద్‌లో జరిగే ‘తెలంగాణ రాష్ట్ర వన్యప్రాణి మండలి’ తొలి సమావేశంలో ఆమోదించనున్నట్లు తెలిసింది. ముఖ్యమంత్రి అధ్యక్షతన ఉండే వన్యప్రాణి సంరక్షణ మండలి కొత్త కమిటీ డిసెంబరు 18న ఏర్పాటైంది.
వన్యప్రాణి ప్రాంతాలు, రక్షిత అటవీప్రాంతం చుట్టూ ఉండే సున్నిత ప్రాంతాల పరిధిలో చేపట్టే మరికొన్ని ప్రాజెక్టులకు అటవీ భూముల బదలాయింపుపైనా మండలి నిర్ణయం తీసుకోనుంది.
అదే మండలంలో మరోచోట
కవ్వాల్ ప్రాంతాన్ని పెద్దపులులకు ఆవాసంగా మార్చేందుకు కోర్‌ఏరియాలో 20కిపైగా గ్రామాల్ని తరలించాలని గతంలో నిర్ణయించిన అటవీశాఖ..ఆయాగ్రామాల నుంచి వ్యతిరేకత రావడంతో ప్రయోగాత్మకంగా మైసంపేట, రాంపూర్ గ్రామస్థులతో మాట్లాడి ఒప్పించింది. 142 గిరిజన కుటుంబాల్ని తరలించనున్నారు. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ(ఎన్టీసీఏ) నుంచి నిధులు విడుదలయ్యాయి. వీరిని కడెం మండలంలోని పెద్దూరుకు తరలించాలని నిర్ణయించిన అటవీశాఖ..112 హెక్టార్ల ప్రాంతాన్ని గుర్తించింది. దీన్ని నివాసప్రాంతంగా చేయాలంటే అటవీభూమిని డీనోటిఫై చేయాలి.
కొన్నినెలలుగా రాష్ట్ర వన్యప్రాణి మండలి లేకపోవడంతో ఈ ప్రక్రియ నిలిచిపోయింది. తాజాగా ఏర్పడడంతో ఈ అంశం కొలిక్కి వచ్చినట్లైంది. ఇక్కడ ఆమోదం తర్వాత కేంద్ర వన్యప్రాణి మండలికి సిఫార్సు చేయనున్నారు. అయితే గ్రామాల్ని తరలించే ప్రాంతాల్ని డీనోటిఫై చేసేందుకు మండలి ఆమోదం అవసరం లేదని..తరలించే ప్రాంతం టైగర్ రిజర్వుకు అవతల ఉంటుందని వన్యప్రాణి సంరక్షణ నిపుణుడు ఒకరు పేర్కొన్నారు. రెండుగ్రామాల్ని తరలించే ప్రాంతం కడెం మండలంలోనే ఉందని, ఇది టైగర్ రిజర్వు పరిధిలోకి వస్తున్నందున మండలి ఆమోదం అవసరమేనని ఓ అటవీ అధికారి అభిప్రాయపడ్డారు.
షరతులతో మరికొన్ని ప్రాజెక్టులకు