manchiryala floods: మంచిర్యాల జిల్లాలో కేంద్రంలోని లోతట్టు ప్రాంత కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తోడు ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. నదిలో కలిసే రాళ్లవాగు బ్యాక్ వాటర్.. లోతట్టు ప్రాంత కాలనీల్లోకి చేరడంతో అనేక ఇళ్లన్నీ నీట మునిగాయి. ఇప్పటికే రామ్ నగర్, ఎల్ఐసి కాలనీ, బాలాజీ నగర్, పద్మశాలి కాలనీ, ఎన్టీఆర్ నగర్, బైపాస్ రోడ్డు, లక్ష్మీ నగర్, ఆదిత్య ఇంక్లైన్ పాత మంచిర్యాల సరిహద్దులోని నివాస గృహాలు నీట మునిగాయి.
మంచిర్యాలలో 10 కాలనీలు జలదిగ్బంధం.. గుర్రాలపై వెళ్లి రక్షించిన అధికారులు
manchiryala floods: వరదనీరు మంచిర్యాలను ముంచెత్తింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు తోడు రాళ్లవాగు బ్యాక్ వాటర్ వరద తోడవడంతో... పట్టణంలో 10 కాలనీలు నీటమునిగాయి. వరదలో చిక్కుకున్న వారిని తెప్పలు, గుర్రాలపై సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. కలెక్టర్ భారతి హోళీ కేరి, డీసీపీ అఖిల్ మహాజన్ స్వయంగా వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించారు.
గుర్రాలపై తరలింపు: వరదలో చిక్కుకున్న ప్రజలను పోలీసులు మున్సిపల్ సిబ్బంది సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. లక్ష్మీ నగర్ ఎల్ఐసి కాలనీ, రామ్ నగర్ కాలనీలోని పెద్దపెద్ద భవనాలు నీటలో మునిగిపోవడంతో మత్స్యకారుల సహకారంతో తెప్పలపై వారిని సురక్షిత ప్రాంతాలకు తీసుకువచ్చారు. మరికొందరిని గుర్రాలపై తరలించారు. ఇందుకోసం పోలీస్ శాఖ గుర్రాలను వినియోగించారు. పట్టణంలోని వరద బాధిత ప్రాంతాలను జిల్లా కలెక్టర్ భారతి హోళీ కేరి, ఎమ్మెల్యే దివాకర్ రావు, డీసీపీ అఖిల్ మహాజన్ పరిశీలించి సహాయక చర్యలు అందించారు. ముంపు బాధితులను అప్రమత్తం చేస్తూ పట్టణంలో ఏర్పాటు చేసిన కేంద్రాలకు తరలించారు. సింగరేణి యాజమాన్యం రెస్క్యూ టీంల సాయంతో ముంపునకు గురైన కాలనీలలో రక్షణ చర్యలు చేపట్టారు. స్వచ్ఛంద సంస్థలు సైతం బాధితులకు ఆహారాన్ని అందిస్తూ సహాయక చర్యల్లో పాలుపంచుకుంటున్నారు.