కరోనా కట్టడి కోసం రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించి సోమవారం నాటికి 14 రోజులు పూర్తయింది. అన్ని రకాల కార్యకలాపాలకు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే అనుమతిచ్చారు. 10 గంటల తర్వాత రోడ్లపైన వాహనాలు, ప్రజలు తిరగకుండా పోలీసులు పటిష్ట చర్యలు చేపడుతున్నారు. అనేకమంది పనులు దొరకక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒకవైపు విధులు నిర్వహిస్తూనే… మరోవైపు ఇబ్బందులు పడుతున్న పేద ప్రజలకు తమ వంతు సహాయం చేస్తూ పోలీసులు దాతృత్వాన్ని చాటుకుంటున్నారు.
కరోనా వేళ పోలీసుల దాతృత్వం
మంచిర్యాల జిల్లా పోలీసులు కరోనా వేళ పేద ప్రజలకు తమ వంతు సహయం చేస్తూ ప్రజల మన్ననలను పొందుతున్నారు. ఒకవైపు లాక్ డౌన్ పటిష్ఠంగా అమలు చేస్తూనే మరోవైపు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
మంచిర్యాల జిల్లాలో డీఎస్పీ అచ్చేశ్వరరావు నేతృత్వంలో పోలీసులు లాక్ డౌన్ పకడ్బందీగా అమలు చేస్తూనే సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. డివిజన్ పరిధిలోని ఎనిమిది మండలాల్లో పనిచేస్తున్న ఆయా స్టేషన్ హౌస్ ఆఫీసర్లు తనకంటూ ప్రత్యేకత చాటుకునేలా సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. లాక్ డౌన్ వేళ వాహనాలు దొరక్క జిల్లా కేంద్రానికి వచ్చి ఇక్కడే ఆగిపోయిన వారిని తమ వాహనాల్లో గమ్యస్థానాలకు చేర్చుతున్నారు. పేదలకు నిత్యావసర సరుకులను అందజేస్తూ మనసున్న మారాజులుగా నిలుస్తున్నారు. జిల్లాలోని పోలీసులు యాచకుల వివరాలు తెలుసుకొని వారి సొంత ఊర్లకు పంపిస్తున్నారు. ప్రజలు పోలీసులకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.