పదవీ విరమణ పొందిన సింగరేణి కార్మికులు(Singareni Retired Workers) ఆందోళన బాట పట్టారు. తమకు ఇస్తున్న పెన్షన్ డబ్బులు పెంచాలని డిమాండ్ చేస్తూ మంచిర్యాల జిల్లా మందమర్రి జీఎం కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు.
అరకొర సౌకర్యాల మధ్య బొగ్గును ఉత్పత్తి చేసి దేశాభివృద్ధిలో భాగస్వాములైన తమను యాజమాన్యం, కార్మిక సంఘాలు(unions) పట్టించుకోవడం లేదని కార్మికులు (Singareni Retired Workers) ఆవేదన వ్యక్తం చేశారు. పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా తమ పెన్షన్ పెంచాలని డిమాండ్ చేశారు. వేల రూపాయలు ఖర్చు అవుతుండగా తమకు మాత్రం వందల రూపాయల్లో పెన్షన్ ఇవ్వడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం అందించే ఆసరా పింఛన్ 2000 వేల రూపాయలు అందుతుండగా.. తమకు మాత్రం సింగరేణి యాజమాన్యం 300 నుంచి 2000 వేల రూపాయల లోపే ఇస్తుందని వాపోయారు. దిల్లీలో జరిగే జేబీసీసీఐ సమావేశంలో తమ సమస్యలు లేవనెత్తి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సింగరేణి అధికారులకు వినతిపత్రం అందజేశారు.
నేను కెకె2 లో పని చేశా. నాకు 260 రూపాయలు పెన్షన్ వస్తోంది. మరీ ఆ డబ్బులతో ఎలా బతకాలో తెలియడం లేదు. మమ్మల్ని ఆదుకోవాలని వేడుకుంటున్నాం. మాకు కనీసం పాలబిల్లు, నూనె పాకెట్కు సరిపోవడం లేదు. కావున కార్మికుల కష్టాలను పట్టించుకోండి. మేము బతకలేక ఇటుకల కంపెనీల్లో పని చేయాల్సి వస్తోంది. తమకు పెన్షన్ డబ్బులు పెంచాలని సింగరేణి యాజమాన్యం, కార్మిక సంఘాల నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నా. - లక్ష్మయ్య, సింగరేణి విశ్రాంత కార్మికుడు