తెలంగాణ

telangana

ETV Bharat / state

బెల్లంపల్లిలో మరో రెండు ఉపరితల గనులు.. - surface mines in bellampally

రోజురోజుకు బొగ్గు గనులు ఒక్కొక్కటిగా మూతపడుతున్నాయి. ఏరియాలో కార్మికుల సంఖ్య తగ్గుతోంది. ఇలాంటి తరుణంలో మళ్లీ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఏరియాపై ఆశలు రేకెత్తుతున్నాయి. మరో రెండు ఉపరితల గనుల ఏర్పాటుకు సింగరేణి యాజమాన్యం కసరత్తు చేస్తుండడంతో ఆశలు చిగురిస్తున్నాయి. వివిధ కారణాలతో మూతకు గురైన బొగ్గు గనుల్లో ప్రత్యామ్నాయంగా ఉపరితల గనులు ఏర్పాటు చేయాలని యాజమాన్యం నిర్ణయించింది.

telangana singareni decided to form another two surface mines in bellampally
బెల్లంపల్లిలో మరో రెండు ఉపరితల గనులు

By

Published : Mar 15, 2021, 10:14 AM IST

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఏరియా ప్రాంతంలో బొగ్గు నిక్షేపాలు అధికంగా ఉండటంతో గోలేటి, మహావీర్‌ ఖని (ఎంవీకే) ఉపరితల గనుల ఏర్పాటుకు యాజమాన్యం సన్నాహాలు చేస్తోంది. ఏరియాలో ప్రస్తుతం కుమురంభీం జిల్లా తిర్యాణి మండలంలో ఖైరిగూర ఓసీపీ, మంచిర్యాల జిల్లా తాండూరు మండల పరిధిలో బీపీఏ ఓసీపీ-2 గనులు కొనసాగుతున్నాయి.

1300 హెక్టార్ల భూమిలో గోలేటి ఓసీపీ

కొత్తగా ఏర్పాటు చేయనున్న గోలేటి ఉపరితల గని ఏర్పాటుకు 1300 హెక్టార్ల భూమి అవసరం ఉందని అంచనా వేశారు. ఇందులో 615 హెక్టార్లు అటవీభూమి కాగా, మిగతా 685 హెక్టార్లు ప్రభుత్వ, ప్రైవేటు భూమిగా గుర్తించారు. అటవీ భూమి అనుమతుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం చెట్ల గుర్తింపు పరిశీలన కొనసాగుతోంది. వివిధ కారణాలతో మూతకు గురైన గోలేటి-1, 1ఏ ఇంక్లైన్‌, గోలేటి-2 భూగర్భ గనులు, బీపీఏ ఓసీపీలో మిగిలి ఉన్న బొగ్గు నిక్షేపాలను కలుపుకొని కొత్తగా గోలేటి ఓసీపీని ప్రారంభించనున్నారు. ముంపునకు గురయ్యే అబ్బాపూర్‌ గ్రామ నిర్వాసితులకు నర్సాపూర్‌లో 14 ఎకరాల భూమిలో 85 కుటుంబాలకు సింగరేణి యాజమాన్యం పునరావాస కేంద్రం ఏర్పాటు చేసి అభివృద్ధి పనులు చేస్తోంది.

మరో మూడేళ్లలోపు తాండూరు మండలంలో ఎంవీకే ఓపెన్‌కాస్టు ప్రారంభించడానికి యాజమాన్యం సన్నాహాలు చేస్తోంది. మూతకు గురైన ఎంవీకే-1,2,3,4,5,6 భూగర్భ గనులను కలుపుకొని ఎంవీకే ఉపరితల గని ఏర్పాటు కానుంది. ఈ గనుల్లో సుమారు 40 మిలియన్‌ టన్నుల బొగ్గు నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించారు. ప్రస్తుతం ప్రారంభ దశలోనే ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ రెండు ఓసీపీలు ప్రారంభమైతే ఏరియాకు మరో 20 ఏళ్ల వరకు ఢోకా ఉండదని అధికారులు చెబుతున్నారు. ఖైరిగూర ఓసీపీ మరో 10 ఏళ్ల వరకు కొనసాగనుంది. ఇందులో 35 లక్షల టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

కొత్తగా ఏర్పాటు అయ్యే ఓసీపీల వివరాలు ఇలా

గోలేటి: ఉపరితల గని

ఎక్కడ: ప్రారంభం గోలేటి ప్రాంతం

ప్రారంభం: ఏడాదిన్నర నుంచి రెండేళ్ల లోపు

గుర్తించిన బొగ్గు నిక్షేపాలు: 62 మిలియన్‌ టన్నులు

ఏడాదికి ఉత్పత్తి చేయాల్సిన బొగ్గు: 35 లక్షల టన్నులు

బొగ్గు గ్రేడు: జీ-10, జీ-11

ఉద్యోగుల సంఖ్య: సుమారు 300 నుంచి 500 వరకు

జీవిత కాలం: సుమారు 18 ఏళ్లు

ఏడాదిన్నర లోపు ప్రారంభిస్తాం

బెల్లంపల్లి ఏరియాలో ఏడాదిన్నర నుంచి రెండేళ్ల లోపు గోలేటి ఓసీపీ ప్రారంభించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. గని ఏర్పాటుకు 1300 హెక్టార్ల భూమి అవసరం ఉంది. అటవీ భూముల అనుమతుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం.

- బి.సంజీవరెడ్డి, జీఎం, బెల్లంపల్లి ఏరియా

ABOUT THE AUTHOR

...view details