ప్రస్తుతం సాంకేతిక యుగం నడుస్తోంది. సాంకేతిక జ్ఞానం లేకపోతే ముఖ్యమైన పనులు జరగడం లేదు. వ్యవసాయం దగ్గర నుంచి పెద్ద పెద్ద పరిశ్రమల వరకూ ఉత్పాదకతలో లాభాలు ఆర్జించడానికి నూతన టెక్నాలజీని వాడుతున్నారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా విద్యార్థులకు సాంకేతిక శిక్షణనివ్వాలనే ఉద్దేశంతో రాష్ట్రంలో ఈ ఏడాది సమ్మర్ సమురాయ్ కార్యక్రమం చేపడుతున్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలురు, బాలికల పాఠశాలల్లో రెండు శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆరు నుంచి పదోతరగతి చదివే పిల్లలకు డ్రోన్ తయారీ, మొబైల్ యాప్ వంటి అంశాలపై తర్ఫీదునిస్తున్నారు సమురాయ్ నిర్వాహకులు. ఈనెల 10న ప్రారంభమైన కార్యక్రమం 25 వరకు కొనసాగనుంది.
విద్యార్థుల్లో ఉత్సాహం
రాష్ట్రంలోని ఖమ్మం, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల నుంచి మొత్తం 800 మంది విద్యార్థులు ఇక్కడ శిక్షణ పొందుతున్నారు. మొబైల్ యాప్ ఎలా తయారు చేయాలి..?, ఆధునీకరణ అంశాలపై 18 మంది శిక్షకులు బాల బాలికలకు వేరు వేరుగా తర్ఫీదు ఇస్తున్నారు. డ్రోన్ తయారీ గురించి కూడా పిల్లలకు వివరిస్తున్నారు. రానున్న రోజుల్లో డ్రోన్లు కీలక పాత్ర పోషిస్తాయని శిక్షణ నిర్వాహకులు తెలిపారు. పిల్లలకు సెలవుల్లో ఇలాంటి అంశాలపై శిక్షణ ఇవ్వడం వల్ల వారు కొత్త కొత్త సాంకేతికత అందిపుచ్చుకోవడానికి అవకాశం ఉంటుందని శిక్షణ ఇంఛార్జి శ్రావణ్ అన్నారు.