Singareni Trade unions strike : నాలుగు బొగ్గు బ్లాకులను ప్రైవేటుపరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కార్మికులు చేపట్టిన సమ్మె.. ఆఖరి రోజైన మూడో రోజూ కొనసాగుతోంది. తమ డిమాండ్ల కోసం నిరసన తెలుపుతూ కార్మికులు స్వచ్ఛందంగా విధులు బహిష్కరించారు. రామగుండం రీజియన్‌లోని 6 భూగర్భ, 4 ఉపరితల గనుల్లో సమ్మె చేస్తున్నారు. కార్మికుల సమ్మెతో బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. కార్మికుల సమ్మె కారణంగా బొగ్గు గనులు బోసిపోతున్నాయి. సమ్మెను విజయవంతం చేయాలంటూ కార్మిక సంఘాలు ర్యాలీ చేపట్టాయి. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియాలోని గనులపై అత్యవసర విధులు నిర్వర్తించే కార్మికులను మాత్రమే విధులకు హాజరయ్యారని కార్మిక సంఘాలు, అధికారులు తెలిపారు. నాలుగు బొగ్గు బ్లాకుల వేలం నిలిపివేయాలని...12 ప్రధాన డిమాండ్లతో తెరాస అనుబంధ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం, ఐదు జాతీయ కార్మిక సంఘాల ఐకాస ఇచ్చిన పిలుపుతో సింగరేణి వ్యాపించిన ఆరు జిల్లాలోని వివిధ విభాగాల కార్మికులు, అధికారులు సంపూర్ణ మద్దతు తెలుపుతూ సమ్మెలో పాల్గొంటున్నారు.
స్పందించిన యాజమాన్యం
Singareni coal privatization : సింగరేణి కార్మికులు చేపట్టిన రెండు రోజుల సమ్మె ప్రశాంతంగా ముగిసింది. సమ్మెలో భాగంగా రెండో రోజు ఎమ్మెల్యే, ఎంపీలు సంఘీభావం తెలిపారు. 72 గంటల సమ్మెలో సింగరేణి సంస్థకు దాదాపు 150 కోట్లు విలువ చేసే నాలుగు లక్షల టన్నులకు పైగా బొగ్గు ఉత్పత్తికి విఘాతం ఏర్పడింది. సింగరేణి సంస్థ స్పందించింది. ఈ నెల 15, 16 తేదీల్లో కార్మిక సంఘాలను దిల్లీకి తీసుకెళ్లి అక్కడ కేంద్ర బొగ్గు శాఖ మంత్రితో పాటు... బొగ్గు మంత్రిత్వ శాఖ కార్యదర్శితో సమావేశం ఏర్పాటు చేస్తామని సింగరేణి యాజమాన్యం హామీ ఇచ్చింది.