కేంద్ర ప్రభుత్వం 41 బొగ్గు బ్లాకులను ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు వేలం నిర్వహించడాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా బొగ్గు పరిశ్రమల్లో జాతీయ కార్మిక సంఘాలు 72 గంటల సమ్మెకు పిలుపునిచ్చాయి. దీనికి మద్దతుగా సింగరేణి బొగ్గు గనుల కార్మికులు, గుర్తింపు కార్మిక సంఘమైన తెబొగకాసం కూడా కేంద్ర ప్రభుత్వ విధానాన్ని నిరసిస్తూ సమ్మె నిర్వహించేందుకు ముందుకొచ్చాయి.
సింగరేణి వ్యాప్తంగా ఆరు జిల్లాల పరిధిలో ఉన్న 26 భూగర్భ బొగ్గు గనులు, 18 ఉపరితల గనుల్లో పనిచేసే కార్మికులు సమ్మెకు మద్దతిస్తూ విధులకు గైర్హాజరయ్యారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి రీజీయన్లోని మందమరి, శ్రీరాంపూర్, రామకృష్ణాపూర్ ఏరియాలోని 14 భూగర్బగనులు, 6 ఓపెన్ కాస్ట్ గనుల్లో కార్మికులు స్వచ్ఛందంగా విధులు బహిష్కరించారు. సమ్మె ప్రభావంతో బెల్లంపల్లి రీజీయన్లో 30 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలిగింది. సింగరేణి వ్యాప్తంగా సమ్మెతో రోజుకు 73 కోట్ల రూపాయల నష్టం వాటిల్లే అవకాశం ఉందని యాజమాన్యం అంచనా వేస్తుంది.