మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ సింగరేణి ఉపరితల గనిలో డీజిల్ కుంభకోణంపై కేంద్ర నిఘా విభాగం విచారణ చేపట్టింది. 2018 నుంచి శ్రీరాంపూర్ లోని ఉపరితల గనిలో ఆగకుండా డీజిల్ దుర్వినియోగం అవుతున్నా.. అధికారులకు చీమ కుట్టినట్లయినా లేకపోవడం కార్మిక వర్గాన్ని విస్మయానికి గురి చేసింది. కార్మిక నాయకులు, కార్మికులు తమ సంస్థలో జరుగుతున్న అవినీతిని ఎండగట్టడంతో కప్పిపుచ్చడానికి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి అధికారులు చేతులు దులుపుకున్నారు.
ఈ విషయం సంస్థ సీఎండీ శ్రీధర్ దృష్టికి వెళ్లడంతో విజిలెన్స్ అధికారులు మరింత జాగ్రత్తగా వ్యవహరించి విచారణ జరిపారు. డీజిల్ దుర్వినియోగంపై కీలక సమాచారం సేకరించడంతో సీఎండి ఆదేశాల మేరకు గుత్తేదారుపై మరోసారి పోలీస్ కేసు నమోదు చేశారు. విజిలెన్స్ విచారణ మేరకు అప్పటి శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ సుభాని , ప్రాజెక్టు అధికారి, గని మేనేజర్, సెక్యూరిటీ అధికారిని బదిలీ చేశారు.
దీనికి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ కార్మిక సంఘాల నుంచి ఒత్తిడి మొదలైంది. చివరికి నలుగురు అధికారులకు చార్జిషీట్ ఇవ్వడం సింగరేణిలో సంచలనం రేకెత్తించింది. ఫలితంగా సింగరేణి వ్యాప్తంగా డీజిల్ వినియోగం తగ్గుముఖం పట్టింది. ప్రధానంగా శ్రీరాంపూర్లోని సింగరేణిలో డీజిల్ వాడకం దాదాపు సగానికి తగ్గింది.